అర్జున్ రెడ్డి.. ఎంత పని చేశాడబ్బా


ఎంత పెద్ద దర్శకుడైనా.. అరంగేట్రం చేయడానికి ముందు అనామకుడే. చాలా కొద్ది మందికి మాత్రమే తొలి చిత్రానికి పేరున్న హీరో హీరోయిన్లు, నిర్మాతలతో పని చేసే అవకాశం వస్తుంది. మెజారిటీ దర్శకులు అరంగేట్ర చిత్రాన్ని పట్టాలెక్కించడానికి.. దాన్ని పూర్తి చేయడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. బడ్జెట్ సరిపోక.. అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేయలేక.. చిత్రానికి అనుకున్నంత బజ్ రాక.. రిలీజ్ తర్వాత ఆశించిన ఫలితాన్ని అందుకోలేక ఇబ్బంది పడే దర్శకులు ఎందరో.

యువ దర్శకుడు సందీప్ రెడ్డి సైతం తన తొలి చిత్రం ‘అర్జున్ రెడ్డి’ మేకింగ్ టైంలో చాలా ఇబ్బందులే పడ్డాడు. ఆ సినిమాను పూర్తి చేయడంలో సమస్యలు ఎదుర్కొన్నాడు. బడ్జెట్ కష్టాలు అతణ్ని వేధించాయి. ఐతే ఇవన్నీ ఫస్ట్ టీజర్ రిలీజయ్యే వరకే. ఆ టీజర్ బయటికి రాగానే మొత్తం కథ మారిపోయింది. ఆ చిత్రానికి అనూహ్యమైన హైప్ వచ్చింది. ఇక ఆ తర్వాత జరిగిందంతా ఒక చరిత్ర.

తొలి సినిమాతో రాత్రికి రాత్రి జీవితాలను మార్చేసుకున్న దర్శకులు చాలామందే ఉన్నారు. కానీ వాళ్లందరినీ మించిన ఎదుగుదల సందీప్ రెడ్డిది. కేవలం ‘అర్జున్ రెడ్డి’తో వచ్చిన పేరుతో అతను బాలీవుడ్లో పెద్ద నిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించాడు. ‘అర్జున్ రెడ్డి’ హిందీ వెర్షన్ ‘కబీర్ సింగ్’కు దర్శకత్వం వహించే అవకాశం అందుకున్నాడు. ఆ చిత్రానికి షాహిద్ కపూర్ లాంటి స్టార్ హీరోతో పని చేసే ఛాన్స్ పట్టేశాడు. ఆ చిత్రం కూడా బ్లాక్‌బస్టర్ అవడంతో సందీప్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు.

రణబీర్ కపూర్‌తో ‘ఎనిమల్’ లాంటి మరో పెద్ద సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. ఆ సినిమా మేకింగ్ దశలో ఉండగానే ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్ అయిన ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం వచ్చింది. అది కూడా ప్రభాస్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ చిత్రం సందీప్ చేతికి వచ్చింది. ఇదంతా కూడా ‘అర్జున్ రెడ్డి’ చలవే. ఈ సినిమాను దాటి కొత్త కథతో సందీప్ ఇంకా రుజువు చేసుకోలేదు. ఈలోపే ప్రభాస్‌తో ప్రెస్టీజియస్ మూవీ చేసే అవకాశం అందుకున్నాడు. ‘అర్జున్ రెడ్డి’ ప్రభావం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికిది రుజువు. ఒక్క సినిమాతో ఇలాంటి ఎదుగుదల భారతీయ సినిమా చరిత్రలోనే అరుదు అనడంలో సందేహం లేదు.