మహేష్‌కు 75 వేలు గూగుల్ పే చేశా-విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ముంగిట విమర్శలు, ఆరోపణలు.. ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలు మరో స్థాయికి చేరుకుంటున్నాయి. ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ వాళ్లు, వారి మద్దతుదారులు.. అటు మంచు విష్ణు బృందం, వారి సపోర్టర్స్ పరస్పరం చేసుకుంటున్న విమర్శలు, ఆరోపణలు చూసి సామాన్య జనాలు విస్తుబోతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్‌కు మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి మెగా ఫ్యామిలీ వెనక్కి తగ్గిందన్న అభిప్రాయాల నేపథ్యంలో చిరంజీవి సోదరుడు నాగబాబు రెండు రోజులుగా గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు.

తాజాగా ఆయన ప్రకాష్ రాజ్ తరఫున గట్టిగా వాయిస్ వినిపించారు. ఈ క్రమంలో మంచు విష్ణు, అతడి ప్యానెల్ తీవ్ర ఆరోపణలే చేశారు. మంచు విష్ణు ‘మా’ సభ్యులు కొందరికి ఓటు కోసం తలో రూ.10 వేల చొప్పున పంపిణీ చేసినట్లు ఆయన ఆరోపించారు. దీనిపై మంచు విష్ణు దీటుగా, వ్యంగ్యంగా స్పందించాడు.

గురువారం ప్రెస్ మీట్ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలపై మంచు విష్ణు రెస్సాండయ్యాడు. కొందరు సభ్యులకు ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారని నాగబాబు చేసిన ఆరోపణలపై మీ స్పందనేంటి అని ఓ విలేకరి అడగ్గా, దానికి విష్ణు బదులిస్తూ.. “ఓటుకు పది వేలు కాదు. రూ.75 వేలు ఇస్తున్నాం. స్టార్‌ హీరో మహేష్ బాబుకు రూ.75 వేలు గూగుల్‌ పే చేశాను. ఆయన ఊరిలో లేకపోవడంతో చూసుకోలేదు. ఎన్నికలు అయ్యాక ఓటు వేయని వాళ్లను గుర్తు పెట్టుకుని వాళ్ల దగ్గరి నుంచి రూ.75 వేలు వెనక్కి తిరిగి తీసుకుంటా” అని వెటకారంగా స్పందించాడు.

ప్రకాష్ రాజ్‌ను మూడుసార్లు ‘మా’ అధ్యక్షుడిగా గెలిపించుకుంటామని, ఆయనతోనే ‘మా’ బాగుపడుతుందని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని విష్ణు అన్నాడు. ఇక ఇండస్ట్రీలో లోకల్, నాన్ లోకల్ అనే సమస్య చాలా పెద్దదని.. తెలుగు సినిమాల్లో తెలుగు నటుల్నే పెట్టుకోవాలి అనే దానిపై చాలా చర్చించాల్సి ఉందని.. బయటి నటీనటుల్ని ఎందుకు తీసుకువస్తున్నామనే విషయంలో ఇంతకుముందే సమాధానం చెప్పామని.. ఈ సమస్యకు పరిష్కారం కోసం మోహన్ బాబు ఫిలిం ఇన్‌స్టిట్యూట్ మొదలు పెడుతున్నామని విష్ణు తెలిపాడు.