రాఘవేంద్రుడి కోడలు.. రచ్చ రచ్చ

రాఘవేంద్రుడి కోడలు.. రచ్చ రచ్చ

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కోడలు.. ప్రకాష్ కోవెలమూడి భార్య కనిక థిల్లాన్ బాలీవుడ్లో కొంచెం పేరున్న స్క్రీన్ ప్లే రైటరే. షారుఖ్ ఖాన్ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్‌లో ఆమె చాలా కాలం పని చేసింది. బయటి సినిమాలకు కూడా స్క్రీన్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తించింది. తెలుగులో ప్రకాష్ డైరెక్ట్ చేసిన ‘సైజ్ జీరో’కు కథ అందించింది ఆమే. ప్రస్తుతం ప్రకాష్ డైరెక్ట్ చేస్తున్న బాలీవుడ్ మూవీ ‘మెంటల్ హై క్యా’కు కూడా కనికనే స్క్రీన్ ప్లే రాసింది. తాజాగా ఆమె పెట్టిన ఒక లెంగ్తీ పోస్ట్ సోషల్ మీడియాలో.. బాలీవుడ్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన షారుఖ్ ఖాన్ చిత్రం ‘జీరో’ మీద ఆమె ఈ పోస్ట్ పెట్టింది. ఈ చిత్రానికి డివైడ్ టాక్ రావడం.. విమర్శకులు చాలా తక్కువ రేటింగ్స్ ఇవ్వడం తెలిసిన సంగతే.

దీనిపైనే కనిక స్పందించింది. విమర్శకుల్ని ఆమె లక్ష్యంగా చేసుకుంది. దర్శకుడు ఆనంద్.ఎల్.రాయ్.. రచయిత హిమాంశు శర్మ ఎప్పుడూ కొత్తదనం కోసమే ప్రయత్నిస్తారని.. వాళ్లిద్దరూ ‘తను వెడ్స్ మను’.. ‘తను వెడ్స్ మను రిటర్న్స్’.. ‘రాన్ జానా’ లాంటి సినిమాలతో బాలీవుడ్ సినిమాల ట్రెండ్‌నే మార్చేశారని.. మిగతా రైటర్లు, దర్శకుల్ని కూడా కొత్తదనం వైపు నడిపించారని.. వాళ్లిద్దరూ ఇప్పుడు ‘జీరో’తో మరోసారి కొత్తదనం పంచారని.. షారుఖ్ ఖాన్ లాంటి పెద్ద స్టార్ ఉన్నాడని చూడకుండా వైవిధ్యంగానే సినిమాను నడిపించారని.. కానీ విమర్శకులు మాత్రం ఒక పరిధి దాటి బయటికి రాలేక.. కొత్తదనం ఉన్న ఈ సినిమా గురించి విమర్శలు గుప్పిస్తున్నారని ఆమె అంది.

అందరూ నెగెటివ్ రివ్యూలు ఇవ్వడంతో అంతగా ఈ సినిమాలో ఏం లోపం జరిగిందా అని థియేటరుకి వెళ్లానని.. కానీ ఈ చిత్రం తనను పూర్తిగా సంతృప్తి పరిచిందని.. తన లాంటి స్క్రీన్ రైటర్లందరూ కొత్తగా ఆలోచించేలా స్ఫూర్తినిచ్చిందని.. ఇలాంటి సినిమాను ఎలా విమర్శిస్తారంటూ విమర్శకులపై ధ్వజమెత్తింది కనిక. 2018లో అత్యంత ముఖ్యమైన సినిమాల్లో ‘జీరో’ ఒకటని.. ఈ సినిమా చేసినందుకు షారుఖ్‌తో పాటు ఆనంద్, హిమాంశులకు హ్యాట్సాఫ్ అని ఆమె అంది. ఈ పోస్టుపై బాలీవుడ్ జనాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. షారుఖ్ అభిమానులు దీన్ని వైరల్ చేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English