ఆ పాత్రలో వరుణ్.. సెట్టవుతాడా?

ఆ పాత్రలో వరుణ్.. సెట్టవుతాడా?

పెద్దగా బ్యాగ్రౌండ్ ఏమీ లేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు సైతం మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడిపోతున్నారు. కమర్షియల్ సినిమాలే చేస్తున్నారు. హీరో ఎలివేషన్ల కోసం తహతహలాడిపోతున్నారు. కానీ మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా.. మాస్ సినిమాలు చేయడానికి తగ్గ కటౌట్ ఉన్నా.. వరుణ్ తేజ్ మాత్రం మొదట్నుంచి వైవిధ్యమైన.. సాఫ్ట్ క్యారెక్టర్లే ట్రై చేస్తున్నాడు. ముకుంద.. కంచె.. ఫిదా.. అంతరిక్షం.. ఇలా అతను ఎంచుకున్న కథల్లో చాలా వైవిధ్యం చూడొచ్చు. ఈ తరహా సినిమాలు చేసే యువ కథానాయకులు చాలా తక్కువమందే. ఈ విషయంలో అతడిని అభినందించాల్సిందే. వరుణ్ కొత్త సినిమా ‘అంతరిక్షం’ ఓ మోస్తరు స్థాయిలో నడుస్తోంది. దీని తర్వాత సంక్రాంతికి ‘ఎఫ్-2’ లాంటి కామెడీ మూవీతో పలకరించబోతున్నాడు.

ఆపై అతను తమిళ సూపర్ హిట్ మూవీ ‘జిగర్ తండ’ రీమేక్‌లో నటించబోతున్నాడు. ఇందులో అతను హీరో కాదు.. విలన్. ఇదే పెద్ద షాక్. తమిళంలో బాబీ సింహా చేసిన నెగెటివ్ రోల్‌లో అతను కనిపించబోతున్నాడు. ఇదేమీ ఊరికే అలా నెగెటివ్ టచ్ ఇచ్చి.. ఆ తర్వాత హీరోలా మారిపోయే పాత్ర కాదు. పూర్తి స్థాయి విలన్ పాత్ర. చాలా క్రూరంగానే ఉంటుంది. మనిషిని నిలువునా తగలబెట్టేయడం.. ఇంట్లో మాట్లాడుతూ మాట్లాడుతూ కత్తి దించి.. పక్కన కూర్చోబెట్టేయడం.. ఇలాంటి క్రూరమైన లక్షణాలుంటాయి ఆ పాత్రలో. నిజానికి బాబీ సింహా ఇలాంటి పాత్ర చేస్తాడని ఎవ్వరూ అనుకోలేదు. ఆ సినిమాకు ముందు అతను కామెడీ రోల్స్.. చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేశాడు.

బాబీకి అదిరిపోయే మేకోవర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్.. తమిళ సినిమా చరిత్రలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ విలన్ రోల్స్ అనదగ్గ పాత్రతో అతడి కెరీర్‌నే మార్చేశాడు. బాబీ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాకు అతను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. అలాంటి పాత్రలో.. బాబీని మ్యాచ్ చేయడం వరుణ్‌కు చాలా పెద్ద సవాలే. బాబీని బ్లాంక్ మైండ్‌తో చూశారు తమిళ జనాలు. కానీ ఇక్కడ వరుణ్ హీరో. అతడిని ఒక రకమైన పాత్రల్లో చూశారు. చాలా వరకు సాఫ్ట్‌గానే కనిపించాడతను. ఐతే ఇంత క్రూరమైన విలన్ పాత్రలో అతను మెప్పించడం మామూలు విషయం కాదు. తనకున్న ఇమేజ్‌ గుర్తుకు రాకుండా చూడాలి. క్రూరంగా కనిపించాలి. లుక్ పరంగా.. నటన పరంగా మేకోవర్ చూపించాలి. మరి హరీష్ శంకర్ అతడిని ఎలా ప్రెజెంట్ చేస్తాడో.. వరుణ్ తన వంతుగా ఏం చేసి మెప్పిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English