అయ్యో పాపం.. షారుఖ్

అయ్యో పాపం.. షారుఖ్

ఒక పెద్ద స్టార్ హీరో గురించి అయ్యో పాపం అనాల్సిన పరిస్థితి రావడం విచారకరమే. కానీ షారుఖ్ పరిస్థితి నిజంగానే అంత దయనీయంగా ఉందిప్పుడు. బాలీవుడ్ సినిమా ఆడాలంటే అందులో సెక్స్ అయినా ఉండాలి.. లేదా షారుఖ్ అయినా ఉండాలి అంటూ కామెంట్ చేసేవాళ్లు ఒకప్పుడు. దీన్ని బట్టి షారుఖ్ పాపులారిటీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అతడి సినిమాలు ఒకప్పుడు ఇరగాడేసేవి. అందుకే అతడిని బాలీవుడ్ బాద్ షా అని.. కింగ్ ఖాన్ అని అనేవాళ్లు. అలాంటివాడు ఇప్పుడు ఒక మోస్తరు హిట్ కోసం అల్లాడిపోతున్నాడు. చివరగా ఎప్పుడో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’తో హిట్టు కొట్టాడతను. దాని తర్వాత వచ్చిన సినిమాలన్నీ దారుణాతి దారుణ ఫలితాలందుకున్నాయి. ‘దిల్ వాలా’.. ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’ లాంటి సినిమాలైతే షారుఖ్ క్రెడిబిలిటీని పూర్తిగా దెబ్బ తీసేశాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఖాన్ ఆశలన్నీ ‘జీరో’ మీదే నిలిచాయి. ‘తను వెడ్స్ మను’.. ‘రాన్ జానా’ లాంటి మంచి సినిమాలు అందించిన ఆనంద్ ఎల్.రాయ్‌తో జట్టు కట్టి.. సొంత నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్లో ఈ సినిమాను నిర్మించాడు షారుఖ్. ఎప్పుడూ సూపర్ హీరోలా కనిపించే అతను.. ఈసారి మరగుజ్జు పాత్ర చేయడానికి సాహసించాడు. ఇవన్నీ హిట్ కోసమే. కానీ శుక్రవారం రిలీజైన ‘జీరో’ డివైడ్ టాక్ తెచ్చుకుంది. కొందరు బాగుందన్నారు. పర్వాలేదన్నారు. కొందరు వేస్ట్ అనేశారు.

క్రెడిబుల్ క్రిటిక్ అయిన రాజీవ్ మసంద్ రెండు స్టార్ల రేటింగ్ ఇవ్వడంతో ‘జీరో’ నిలబడే అవకాశాలు లేవని తేలిపోయింది. మొత్తానికి షారుఖ్‌కు మరోసారి ఆశాభంగం తప్పదని తేలిపోయింది. కచ్చితంగా హిట్టవుతుందనుకున్న సినిమా కూడా ఇలా అయిపోవడంతో షారుఖ్ కెరీర్ అయోమయంలో పడిపోయింది. ఇక అతడిని ఎవరు కాపాడుతారన్న నిర్వేదంలోకి వెళ్లిపోతున్నారు అభిమానులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English