టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఇంత మార్పా?


ఒక సినిమాకు సంబంధించి దర్శకుడు అత్యంత కీలకమైన వ్యక్తి అనడంలో సందేహం లేదు. ఆ తర్వాతి స్థానం నిజానికి రచయితకు ఇవ్వాలి. ఎందుకంటే ఒక సినిమాకు తొలి అడుగు పడేది కథ దగ్గర. ఆ కథే సినిమాకు ఆధారం. సినిమా హిట్టవుతుందా.. ఫట్టవుతుందా.. ఒక చిత్రాన్ని నమ్ముకున్న వారి భవితవ్యం ఏంటి అన్నది ఈ కథను బట్టే ఉంటుంది. ఇంత కీలకమైన కథను తీర్చిదిద్దే రచయితకు ఇండస్ట్రీలో సరైన ప్రాధాన్యం దక్కట్లేదన్న ఆవేదన ఆ వర్గంలో ఉంది.

ఒకప్పటితో పోలిస్తే సినిమా పోస్టర్లో కానీ.. టైటిల్ కార్డ్స్‌లో.. మరో చోట కానీ కానీ రచయితకు ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వట్లేదన్నది వాస్తవం. డబ్బులిస్తే క్రెడిట్ ఇవ్వరు.. క్రెడిట్ ఇస్తే డబ్బులివ్వరు.. కొన్నిసార్లు రెంటికీ నోచుకోని పరిస్థితి కూడా రచయితలకు ఎదురవుతోంది. ఈ తరం స్టార్ డైరెక్టర్లలో చాలామంది.. రచయితలతో పని చేయించుకుని, నామమాత్రంగా డబ్బులిచ్చి.. తెరపైన మాత్రం ‘రచన-దర్శకత్వం’ అని పూర్తి క్రెడిట్ తీసుకుంటారనే అభిప్రాయం బలంగా ఉంది.

ఇలాంటి పరిస్థితుల్లో ‘కొండపొలం’ ప్రి రిలీజ్ ఈవెంట్ సందర్భంగా క్రిష్ చెప్పిన మాటలు అందరికీ ఆశ్చర్యం కలిగించాయి. రచయితల వర్గానికి ఎంతో ఆనందాన్ని కూడా ఇచ్చాయి. తెలుగు సినీ పరిశ్రమలో రచయితలకు సరైన ప్రాధాన్యం దక్కట్లేదని.. వారికి సరైన ప్రోత్సాహం అందించాలని కరోనా టైంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్లందరూ కలిసి నిర్వహించిన సమావేశంలో చర్చించారట. పాతిక మంది దర్శకులు ఈ సమావేశంలో పాల్గొన్నట్లు.. రచయితల ఇబ్బందులపై చర్చించినట్లు క్రిష్ ఈ వేడుకలో వెల్లడించాడు.

రచయితలకు పూర్తి క్రెడిట్, అలాగే తగిన పారితోషకాలు ఇవ్వాలనే విషయంలో ఏకాభిప్రాయం కలిగిందని.. ఈ దిశగా తొలి అడుగు ‘కొండపొలం’ అని వెల్లడించాడు క్రిష్. ‘తానా’ వార్షికోత్సవాల సందర్భంగా పబ్లిష్ అయిన ‘కొండపొలం’ అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం తెలిసిందే. రాయలసీమకు చెందిన సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఈ కథ రాశారు. ఆయనకు ఈ సినిమా పోస్టర్ మీద ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసలందుకుంది. ప్రి రిలీజ్ ఈవెంట్లో కూడా క్రిష్ ఆయన గురించి గొప్పగా మాట్లాడాడు. సినిమాకు తగ్గట్లే ఆయన చాలా ఉత్కంఠభరితంగా ఈ కథను రాశారని.. తాను స్క్రీన్ ప్లే మాత్రమే సమకూర్చానని క్రిష్ తెలిపాడు. రచయితకు ఇంత ప్రాధాన్యం ఇచ్చిన క్రిష్ తరహాలోనే మిగతా టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు కూడా వ్యవహరించి రైటర్లకు దక్కాల్సిన క్రెడిట్ ఇస్తారేమో చూడాలి.