రామ్ చరణ్ చాలా మారాడబ్బా...

రామ్ చరణ్ చాలా మారాడబ్బా...

కొన్నేళ్ల కిందట ‘నాయక్’ సినిమా ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. మా వెంట్రుక కూడా పీకలేరంటూ అతడు చేసిన సవాలు గుర్తుకొస్తోందా? అలాగే హైదరాబాద్‌లో రోడ్డు మీద ఇద్దరు కుర్రాళ్లపై జరిగిన గొడవకు సంబంధించి వివరణ ఇస్తూ పెట్టిన ప్రెస్ మీట్లో చరణ్ హావభావాలు.. అతడి యాటిట్యూడ్ గుర్తుందా?

అలాగే ‘మగధీర’ సినిమాకు గాను తనకు కాకుండా దాసరి నారాయణ రావుకు ఉత్తమ నటుడిగా నంది అవార్డు దక్కడంపై తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఒక కార్యక్రమంలో అతను మాట్లాడిన మాటలు గుర్తున్నాయా? ఇలాంటివన్నీ క్రోఢీకరించుకుని చరణ్‌కు చాలా పొగరని.. యాటిట్యూడ్ అని జనాలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు.

దీనికి తోడు చరణ్ చేసే మాస్ మసాలు సినిమాలు.. అతడి యాక్టింగ్ స్కిల్స్.. లుక్స్ విషయంలోనూ జనాలకు అభ్యంతరాలుండేవి. మెగా అభిమానుల సంగతలా వదిలేస్తే.. తటస్థంగా ఉండే ప్రేక్షకులు మాత్రం చరణ్‌ను అంతగా ఇష్టపడేవాళ్లు కాదు.

కానీ గత రెండు మూడేళ్లలో కథ మారింది. చరణ్ ఎంచుకున్న సినిమాలు మాత్రమే కాదు.. అతడి వ్యక్తిత్వమూ మారింది. ‘ధృవ’ లాంటి వైవిధ్యమైన సినిమాతో తనపై వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకున్న చరణ్.. ‘రంగస్థలం’లో అద్భుతమైన నటనతో అందరి మనసులూ గెలిచాడు.

అప్పటిదాకా అతడిని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్లు సైతం ఈ సినిమాలో నటనకు ఫిదా అయిపోయారు. ‘రంగస్థలం’ అసాధారణ విజయాన్నందుకోవడానికి అదే ముఖ్య కారణం. కేవలం మెగా అభిమానులే కాదు.. అందరు ప్రేక్షకులూ ఈ సినిమాను మెచ్చారు. ఆదరించారు. ఐతే ఇంత పెద్ద విజయాన్నందుకున్నా పొగరు తలకెక్కించుకోకుండా నేలమీదే ఉండటం చరణ్‌లో వచ్చిన పరిణతికి నిదర్శనం.

‘మగధీర’ సమయంలో మాదిరి ఇప్పుడతను యాటిట్యూడ్ చూపించట్లేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మాటను ఆచరిస్తున్నాడు. తాజాగా ‘అంతరిక్షం’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన చరణ్ చాలా హుందాగా కనిపించాడు. పరిణతితో మాట్లాడాడు. ఎక్కడా అతి చేయలేదు. ముందు రోజు ‘పడి పడి లేచె మనసు’ వేడుకలో అల్లు అర్జున్ చేసిన అతితో పోల్చుకుని చరణ్ హుందాతనాన్ని జనాలు పొగుడుతున్నారు.

సోషల్ మీడియాలో దీని గురించి చర్చ నడుస్తోంది. బహుశా ‘రంగస్థలం’ సినిమా నటుడిగానే కాక వ్యక్తిగానూ అతడిలో చాలా మార్పు తెచ్చినట్లుంది. సింప్లిసిటీకి మారుపేరైన సుకుమార్ తనతో పని చేసిన హీరోల మీద అన్ని రకాలుగా ప్రభావం చూపిస్తాడని పేరుంది. బహుశా చరణ్ మీద కూడా ఆ ప్రభావం ఉందేమో.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English