టాలీవుడ్‌కిది లక్కీ వీకెండా?

టాలీవుడ్‌కిది లక్కీ వీకెండా?

ఈ ఏడాది ద్వితీయార్ధంలో తెలుగు సినిమాల్లో ఆశించినంత ఊపు కనిపించలేదు. ‘గీత గోవిందం’.. ‘అరవింద సమేత’.. ‘2.0’ సినిమాలకు మాత్రమే బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి కనిపించింది. మిగతా సినిమాల్లో రెండు మూడు బాగానే ఆడాయి కానీ.. ఆశించినంత హంగామా అయితే లేదు. ఇక ఒకేవారం రెండు మూడు సినిమాలు రిలీజైన టైంలో ఒకటి ఆడటమే గగనం అయింది.

చాలాసార్లు వీకెండ్లో వచ్చిన సినిమాలు గుంపగుత్తగా లేచిపోయాయి. ఏ వారం కూడా ఒకేసారి రెండు సినిమాలు ఆడిన దాఖలాలు కనిపించలేదు. ఐతే ఏడాది చివర్లో ఈ మ్యాజిక్ చూడొచ్చేమో అన్న ఆశ కలిగిస్తున్నాయి రెండు సినిమాలు. అవే.. పడి పడి లేచె మనసు, అంతరిక్షం. ఈ శుక్రవారం రిలీజ్ కాబోతున్న ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో చాలా ఆశలున్నాయి.

ఈ రెండు చిత్రాలూ వేటికవే చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నాయి. వీటికి సంబంధించిన ప్రతి ప్రోమో ఆకట్టుకుంది. పాజిటివ్ ఫీలింగ్ కలిగించింది. ‘పడి పడి లేచె మనసు’ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీలా కనిపిస్తోంది మొదటి నుంచి. హను రాఘవపూడి అభిరుచి ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తోంది. ఇక శర్వానంద్-సాయిపల్లవి ఎంత మంచి పెర్ఫామర్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జంట సినిమాకు మేజర్ హైలైట్. శర్వా అన్నట్లు ఇది స్యూర్ షాట్ హిట్ అనిపిస్తోంది.

ఇక ‘ఘాజీ’ తర్వాత సంకల్ప్ రెడ్డి తీసిన ‘అంతరిక్షం’ కూడా తొలి సినిమాలాగే సెన్సేషన్ క్రియేట్ చేసేలా ఉంది. ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లి గొప్ప అనుభూతిని పంచేలా కనిపిస్తోంది. తెలుగులో ఈ చిత్రం కొత్త ఒరవడి సృష్టిస్తుందనే నమ్మకాలున్నాయి. సినిమా అంచనాలకు తగ్గట్లు ఉండాలే కానీ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దీనికి గుర్తింపు రావచ్చు. మొత్తంగా రెండు సినిమాల్లో దేన్నీ తక్కువ చేయలేం. రెంటి మీదా అంచనాలు భారీగానే ఉన్నాయి.

మరోవైపు ఈ వారమే రిలీజవుతున్న కన్నడ డబ్బింగ్ సినిమా ‘కేజీఎఫ్’ మీదా ఓ మోస్తరుగా అంచనాలున్నాయి. దానికి ప్రమోషన్ తగ్గింది కానీ.. ఓ వర్గం ప్రేక్షకులు దాని మీదా ఆసక్తితోనే ఉన్నారు. మరి ఈ మూడు సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకుని క్రిస్మస్ వీకెండ్లో బాక్సాఫీస్‌ను కళకళలాడిస్తాయేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English