పేట్ట రిలీజ్.. చారిత్రక తప్పిదం?

పేట్ట రిలీజ్.. చారిత్రక తప్పిదం?

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త సినిమా ‘పేట్ట’ తమిళంలో సంక్రాంతికే పక్కాగా వస్తుందని తేలిపోయింది. అక్కడ ఆడియో రిలీజ్ చేసి సినిమాను గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని కూడా ధ్రువీకరించారు. రజనీతో సహా చిత్ర బృందమంతా ఉద్ధృతంగా సినిమాను ప్రమోట్ చేస్తోంది.

కానీ రిలీజ్ డేట్‌కు మూడు వారాలే సమయం ఉన్నప్పటికీ తెలుగు వెర్షన్ సంగతి ఏమీ తేల్చలేదు. ఇప్పటిదాకా టైటిల్ అనౌన్స్ చేయలేదు. అసలు తెలుగులో ఈ చిత్రం విడుదలవుతుందన్న సంకేతాలు కూడా ఏమీ కనిపించడం లేదు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తే తెలుగులో ఈ చిత్రం విడుదల కానట్లే కనిపిస్తోంది. మరి తమిళంలో విడుదలయ్యాక.. కొంచెం గ్యాప్ ఇచ్చి తెలుగులో రిలీజ్ చేద్దామనుకుంటున్నారేమో తెలియదు.

ఐతే రజనీ సినిమాను తమిళంతో పాటు తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయలేదంటే చారిత్రక తప్పిదమే అవుతుంది. గత రెండున్నర దశాబ్దాల్లో ఎప్పుడూ అలా జరగలేదు. సూపర్ స్టార్‌కు తెలుగులోనూ భారీగా అభిమాన గణం ఉంది. ఇక్కడ స్టార్ హీరోల సినిమాలకు దీటుగా వసూళ్లు వస్తాయి. ‘2.0’ హక్కులు రూ.72 కోట్లకు అమ్ముడయ్యాయి. ఇప్పటికే రూ.50 కోట్లకు పైగా షేర్ వచ్చింది.

ఈ చిత్రం తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద స్థాయిలో రిలీజై.. అక్కడికంటే ఇక్కడే ఎక్కువ వసూళ్లు సాధించింది. అలాంటి మార్కెట్ ఉన్న హీరో సినిమాను తెలుగులో ఒకేసారి రిలీజ్ చేయట్లేదంటే అంత కంటే పెద్ద తప్పిదం ఏముంటుంది? తెలుగులో థియేటర్లు దొరికే పరిస్థితి లేదంటే.. ప్రత్యామ్నాయాలు చూడాలి. లేదంటే కొంచెం వాయిదా వేసి రెండు భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయాలి. అలా కాకుండా ఇంత మార్కెట్ ఉన్న చోట సినిమాను రిలీజ్ ఆపాలని డిసైడయ్యారంటే మాత్రం అంత కంటే పెద్ద తప్పిదం మరొకటి ఉండదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English