బాలీవుడ్డోళ్ల గాలి తీస్తూనే ఉన్నాడు

బాలీవుడ్డోళ్ల గాలి తీస్తూనే ఉన్నాడు

దక్షిణాదిన గత కొన్నేళ్లుగా వస్తున్న సినిమాలు బాలీవుడ్ ఫిలిం మేకర్లకు పెద్ద తలపోటుగా మారుతున్నాయి. దేశమంతా మార్కెట్ ఉన్న హిందీ చిత్రాల బడ్జెట్లు ఇంకా ఒక స్థాయిని మించి పెరగట్లేదు. వంద కోట్లకు అటు ఇటు బడ్జెట్లోనే సినిమాలు తీస్తున్నారు. మరీ ఎక్కువ ఖర్చు చేస్తే రికవరీ కష్టమైపోతోంది.

‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద రూ.240 కోట్లు పెడితే.. బ్రేక్ ఈవెన్‌కు చాలా దూరంలో నిలిచిపోయింది. ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్లు ఉన్నా ఫలితం లేకపోయింది. దీంతో అక్కడ పెద్ద బడ్జెట్లలో సినిమాలు తీయాలంటే భయపడిపోతున్నారు. కానీ దక్షిణాదిన మాత్రం అలవోకగా వందల కోట్లతో సినిమాలు తీసేస్తున్నారు. ‘బాహుబలి’ రెండు భాగాల మీద కలిపి రూ.450 కోట్ల దాకా పెట్టారు. ఇక ‘2.0’ సంగతి తెలిసిందే. దాని బడ్జెట్ ఏకంగా రూ.545 కోట్లు.

‘బాహుబలి’ స్థాయిలో ప్రకంపనలు రేపకపోయినా ‘2.0’ కూడా బాగానే ఆడుతోంది. హిందీలో ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ మార్కుకు చేరువగా ఉంది. ఇది చూసి లెజెండరీ డైరెక్టర్ శేఖర్ కపూర్ మరోసారి లైన్లోకి వచ్చాడు. దక్షిణాదిన ఇంత భారీ చిత్రాలు విజయవంతంగా పూర్తవుతుండటం.. ప్రేక్షకుల్ని మెప్పిస్తుండటం పట్ల ఆయన ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ ఫిలిం మేకర్లకు క్లాస్ పీకాడు. ఇంతకుముందు ‘బాహుబలి’ రిలీజైనపుడు ఆయన బాలీవుడ్ డైరెక్టర్ల గాలి తీసేలా మాట్లాడాడు. ఇప్పుడు మరోసారి అలాగే మాట్లాడాడు.

దక్షిణాదిన ఇంతేసి భారీ సినిమాలు ఎలా తీస్తున్నారో అని ఆశ్చర్యపోయిన శేఖర్.. బాలీవుడ్ వాళ్లు ఇలాంటి సినిమాలు ఎందుకు తీయలేకపోతున్నారని ప్రశ్నించాడు. వాళ్లతో పోలిస్తే సౌత్ డైరెక్టర్లకు ప్యాషన్ ఎక్కువగా ఉందన్నాడు. ఈ ట్వీట్‌కు తోడుగా ‘బాహుబలి’.. ‘2.0’ హ్యాష్ ట్యాగ్స్ జోడించాడాయన. కానీ బాలీవుడ్లో భారీ బడ్జెట్లు పెట్టినపుడల్లా దారుణమైన ఫలితాలు వస్తుండటంతో మళ్లీ చేతులు కాల్చుకోవడం ఎందుకని నిర్మాతలు వెనక్కి తగ్గుతున్నారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English