బాహుబలితో పోలిస్తే మటాషే..

బాహుబలితో పోలిస్తే మటాషే..

‘బాహుబలి’తో ఏ సినిమానైనా పోల్చి చూస్తే దారుణాతి దారుణమైన ఫలితాలొస్తున్నాయి. ఆ రకమైన ప్రమోషన్ సినిమాకు బాగా చేటు చేస్తోంది. మూడేళ్ల కిందట తమిళంలో వచ్చిన విజయ్ సినిమా ‘పులి’ని ‘బాహుబలి’తో పోల్చారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇక హిందీలో ఈ మధ్యే వచ్చిన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ను కూడా ‘బాహుబలి’తో పోల్చారు. దాని రికార్డుల్ని ఇది బద్దలు కొడుతుందన్నారు. ఆ సినిమా ఫలితం ఏమైందో తెలిసిందే. ఇప్పుడు తాజాగా మలయాళ మూవీ ‘ఒడియన్’కూ ఈ పోలిక వచ్చింది. అంటే ‘బాహుబలి’ లాంటి సినిమా అని కాదు కానీ.. రేంజ్ పరంగా ఇది మలయాళ సినీ పరిశ్రమకు ‘బాహుబలి’ లాంటిది అన్నారు. ఈ రకమైన ప్రచారంతోనే సినిమాకు హైప్ పెంచే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ చిత్రానికీ డిజాస్టర్ టాక్ వచ్చింది.

‘మన్యం పులి’తో మలయాళ సినీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రికార్డుల్ని నెలకొల్పాడు మోహన్ లాల్. ఆ రికార్డుల్ని బద్దలు కొట్టే చిత్రమిదని.. లాల్ రేంజ్ ఏంటో ఇండియా మొత్తానికి తెలుస్తుందని అభిమానులు గొప్పలు పోయారు. ఈ చిత్రానికి మలయాళ సినీ చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా రూ.100 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. ఇక వసూళ్లు దానికి రెట్టింపు వస్తాయని అభిమానులు సవాళ్లు విసిరారు. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అని తేలిపోయింది. సినిమాకు వచ్చిన హైప్‌కు, అందులోని కంటెంట్‌కు ఏమాత్రం సంబంధం లేదు. 30-40 ఏళ్ల ముందు వచ్చిన సినిమాల్ని తలపించే పాత కాలం రొమాన్స్.. విలనిజం.. రివెంజ్ డ్రామాతో సినిమా తొలి రోజే ప్రేక్షకుల తిరస్కరణకు గురైంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ చిత్రంపై సెటైర్లు మామూలుగా పేలట్లేదు. రికార్డ్ బ్రేకింగ్ మూవీ అవుతుందనుకుంటే ఇలాంటి ఫలితం రావడం ‘ఒడియన్’ టీంకు పెద్ద షాకే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English