బాబాయ్‌.. అబ్బాయ్ అందుకే క‌లిశారా?

రాజ‌కీయ ప‌రిస్థితులు ఎప్పుడు ఎలా మ‌రుతాయో? చెప్ప‌డం చాలా క‌ష్టం. మిత్రులుగా ఉన్న ఇద్ద‌రు నాయ‌కుల మ‌ధ్య అధికారం కోసం గొడ‌వ జ‌రిగి శ‌త్రువులుగా మారే అవ‌కాశం ఉంది. అలాగే బ‌ద్ధ శ‌త్రువుల కాస్త రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం మంచి స్నేహితులుగా మెస‌ల‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పుడు ఒకే కుటుంబం నుంచి ఒకే పార్టీలో ఉన్న నాయ‌కులు త‌మ మ‌ధ్య విభేధాలను ఇత‌ర నేత‌లు వాళ్ల ప్ర‌యోజ‌నాల కోసం వాడుకునే ప్ర‌మాదం ఉంద‌ని గ్ర‌హించి అలా జ‌ర‌గ‌కూడ‌ద‌ని ఇప్పుడు ఒక‌టిగా క‌లిసి సాగుతున్నారు. వాళ్లే కింజార‌పు అచ్చెన్నాయుడు, రామ్మోహ‌న్ నాయుడు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు శ్రీకాకుళం జిల్లాలోని కింజార‌పు కుటుంబంలో క‌ల‌త‌లు మొద‌ల‌య్యాయ‌నే వార్త‌లు వ‌చ్చాయి. దివంగ‌త నేత ఎర్ర‌న్నాయుడి రాజ‌కీయ వార‌సుడి ఆయ‌న త‌న‌యుడు రామ్మోహ‌న్ నాయుడేన‌ని అభిమానులు త‌మ గ‌ళాన్ని వినిపించారు. ఆయ‌న రాష్ట్ర రాజ‌కీయాల్లో ఉండాల‌ని ఆశించారు. దీంతో ఎర్ర‌న్నాయుడి త‌మ్ముడు అచ్చెన్నాయుడుతో విభేధాలు వ‌చ్చాయ‌నే ప్రచారం సాగింది. రామ్మోహ‌న్ నాయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల‌ని ఎర్ర‌న్నాయుడు భార్య టీడీపీ అధినేత చంద్ర‌బాబును అప్పుడు కోరిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ బాబు మాత్రం అచ్చెన్నాయుడు త‌న ప‌క్క‌నే ఉండాల‌నే ఉద్దేశంతో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. రామ్మోహ‌న్ నాయుడిని ఎంపీ చేసి దిల్లీకి పంపించారు. వీళ్లిద్ద‌రూ గెలిచారు.. కానీ పార్టీ ఓడింది. బాబాయ్ టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అయ్యారు. కానీ అబ్బాయ్ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

మ‌రోవైపు టీడీపీ అధికారంలోకి వ‌స్తే తానే హోం మంత్రి అవుతాన‌ని అచ్చెన్నాయుడి చేసిన వ్యాఖ్య‌ల ప‌ట్ల బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశార‌ని ఆయ‌న‌కు ప్రాధాన్య‌త త‌గ్గింద‌ని మ‌ధ్య‌లో వ్యాఖ్య‌లు వినిపించాయి. అదే స‌మ‌యంలో బాబాయ్ అబ్బాయ్ కూడా క‌లిసిక‌ట్టుగా క‌నిపించ‌లేదు. దీంతో అక్క‌డి టీడీపీ శ్రేణులు ఢీలా ప‌డిపోయాయి. కానీ ఇటీవ‌ల ఈ నాయ‌కులిద్ద‌రూ క‌లిసిపోయారు. పెట్రో ధ‌ర‌ల పెంపుతో స‌హా ఈ మ‌ధ్య జ‌రిగిన ప్ర‌తి ఆందోళ‌న‌లోనూ క‌లిసి పాల్గొన్నారు. శ్రీకాకుళంలో తిరిగి పార్టీకి పున‌ర్వైభ‌వం తీసుకువ‌స్తామ‌ని చెప్తున్నారు. ఈ సారి అక్క‌డ ప‌దికి ప‌ది సీట్లు టీడీపీవే అంటూ కార్య‌క‌ర్త‌ల్లో ఉత్సాహం నింపుతున్నారు.

అయితే ఒక్క‌సారిగా వీళ్ల‌లో వ‌చ్చిన మార్పు వెన‌క కొన్ని కార‌ణాలున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ ఇద్ద‌రు వేర్వేరుగా ఉండే న‌ష్ట‌పోవ‌డం ఖాయ‌మ‌ని భావించారు. మ‌రోవైపు జిల్లా టీడీపీలో కొత్త నాయ‌కులు వ‌స్తున్నారు. దీంతో కుటుంబం క‌లిసిక‌ట్టుగా ఉంటేనే పార్టీ త‌మ చేతుల్లో ఉంటుంద‌ని ఈ బాబాయ్ అబ్బాయ్ అనుకున్నారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా త‌న బాబాయ్ ఉన్న నేప‌థ్యంలో జిల్లాలో పార్టీ విజ‌యం సాధించ‌క‌పోతే అది మొత్తం కుటుంబానికే అవ‌మానంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని రామ్మోహ‌న్‌నాయుడు భావించారు. మ‌రోవైపు రామ్మోహ‌న్‌కు మంచి భ‌విష్య‌త్ ఉంద‌ని భావించిన అచ్చెన్నాయుడు కూడా ముందుకు న‌డిపించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో వీళ్లిద్ద‌రూ మ‌ళ్లీ చేతులు క‌లిపి పార్టీకి మునుప‌టి వైభ‌వాన్ని తీసుకు వ‌చ్చేందుకు క‌దులుతున్నారు. కార‌ణాలు ఏవైనా ఈ బాబాయ్ అబ్బాయ్ క‌ల‌వ‌డం పార్టీకి మేలు చేసేదే.