మోహన్ లాల్ హంగామా షురూ

మోహన్ లాల్ హంగామా షురూ

గత కొన్నేళ్లలో సౌత్ ఇండియన్ సినిమాల మధ్య భాషా భేదం చాలా వరకు చెరిగిపోయింది. ఆయా భాషల్లో భారీ చిత్రాలు దక్షిణాదిన అంతటా భారీ స్థాయిలో రిలీజవుతున్నాయి. అనువాద చిత్రాలకు వేరే రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ దక్కుతోంది. వేల థియేటర్లలో సినిమాల్ని రిలీజవుతున్నాయి. మలయాళంలో అత్యధిక ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న మోహన్ లాల్‌ సినిమాలు వేరే రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తునే రిలీజవుతున్నాయి. ‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి తెలుగు సినిమాల్లో నటించి మన ప్రేక్షకుల మనసులు గెలిచిన మోహన్ లాల్.. ఆ తర్వాత ‘మన్యంపులి’.. ‘కనుపాప’ లాంటి డబ్బింగ్ సినిమాలతోనూ అలరించాడు. ఇప్పుడు ఆయన నటించిన ‘ఒడియన్’ కూడా తెలుగులో చెప్పుకోదగ్గ స్థాయిలో రిలీజవుతోంది. ఇక కేరళ అయితే ఈ చిత్రం రికార్డు స్థాయిలో రిలీజవుతోంది. తమిళనాడులో సైతం ఒక స్టార్ హీరో సినిమా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

మలయాళ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కిన ‘ఒడియన్’.. అక్కడ అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగానూ నిలిచింది. దీని బిజినెస్ రూ.100 కోట్లు దాటింది. మాలీవుడ్‌కు ఇది పెద్ద ఫిగరే. కేరళలో ఏకంగా వెయ్యి స్క్రీన్లలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. చిన్న రాష్ట్రమైన అక్కడ ఇప్పటిదాకా ఏ సినిమా ఇంత పెద్ద స్థాయిలో రిలీజవ్వలేదు. తొలి రోజు రికార్డు స్థాయిలో షోలు పడబోతున్నాయి. కేరళలోని ఒక ప్రాంతంలో మోహన్ లాల్ అభిమానులు ఆయనకు 130 అడుగుల కటౌట్ కూడా పెట్టారు. ఇది ఇండియాలోనే రికార్డట. ఈ మధ్యే ‘సర్కార్’ చిత్రం విడుదల సందర్భంగా విజయ్ అభిమానులే కేరళలో 116 అడుగుల కటౌట్‌తో రికార్డు నెలకొల్పారు. వేరే రాష్ట్ర హీరోకే అంత కటౌట్ అంటే.. ఇక మన హీరో ఏం తక్కువయ్యాడని లాల్ అభిమానులు ఇంకా పెద్ద కటౌట్ పెడుతున్నారు. శ్రీ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఒడియన్’పై భారీ అంచనాలున్నాయి. అలవోకగా రూపం మార్చుకునే ఒడియన్ అనే తెగకు చెందిన మనిషిగా లాల్ ఇందులో కనిపించనున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English