వాయిస్ ఇచ్చిన వాడితో కలిసి సినిమా

వాయిస్ ఇచ్చిన వాడితో కలిసి సినిమా

దక్షిణాది ఫిలిం ఇండస్ట్రీల్లో నటన పరంగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్న వాళ్ల జాబితా తీస్తే దుల్కర్ సల్మాన్ పేరు ముందు చెప్పుకోవాలి. వేరే వారసులు ఎంత పెద్ద మాస్ హీరోలైనా అయ్యుండొచ్చు.. ఫ్యాన్ ఫాలోయింగ్ అయినా సంపాదించి ఉండొచ్చు. కానీ నటనలో దుల్కర్ అంత గొప్ప పేరు ఇంకెవ్వరూ సంపాదించలేదనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలోనే తండ్రి నీడ నుంచి బయటపడి.. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించాడతను.

కేవలం మలయాళంలోనే కాదు.. వేరే భాషల్లోనూ సత్తా చాటాడు. తమిళంలో ‘ఓకే బంగారం’.. తెలుగులో ‘మహానటి’.. హిందీలో ‘కార్వాన్’ అతడి నట ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. ‘మహానటి’ తర్వాత తెలుగులో అతను నటించే సినిమా ఏదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

నితిన్ కాంబినేషన్లో ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడితో దుల్కర్ ఓ సినిమా చేస్తాడని ప్రచారం జరిగింది కానీ.. అది నిజం కాదని తేలింది. తాజా సమాచారం ప్రకారం దుల్కర్ మరో మల్టీస్టారర్ మూవీతోనే తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్నాడట. ‘సమ్మోహనం’తో మెప్పించిన ఇంద్రగంటి మోహనకృష్ణ... నాని-శర్వానంద్ కాంబినేషన్లో ఓ మల్టీస్టారర్ చేస్తాడని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్టు ఉంటుందట కానీ.. ఇందులో శర్వా బదులు దుల్కర్ నటిస్తాడట. ఇటీవలే దుల్కర్ కు కథ చెప్పి ఇంద్రగంటి ఒప్పించాడట. దుల్కర్ సినిమా ‘ఓకే బంగారం’ తెలుగు వెర్షన్లో అతడికి వాయిస్ ఇచ్చింది నానీనే కావడం విశేషం. ఇప్పుడు అతడితోనే కలిసి సినిమా చేయబోతుండటం విశేషం. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం..

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English