నిజమే.. మోహన్ లాల్ విశ్వరూపమే

నిజమే.. మోహన్ లాల్ విశ్వరూపమే

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నట కౌశలం ఎలాంటిదో దేశం మొత్తానికి తెలుసు. సొంత భాషలోనే కాక వేరే భాషల్లోనూ సినిమాలు చేసి తనదైన ముద్ర వేశారాయన. ఓవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. తరచుగా ప్రయోగాలూ చేస్తుంటాడు లాల్. దక్షిణాదిన ఒకప్పుడు ప్రయోగాలన్నా.. నట విశ్వరూపం అన్నా కమల్ హాసనే గుర్తొచ్చేవాడు. కానీ గత కొన్నేళ్లలో కమల్ జోరు తగ్గిపోగా.. మోహన్ లాల్ ఈ విషయంలో ముందుకొచ్చేశాడు.

‘మనమంతా’.. ‘జనతా గ్యారేజ్’ లాంటి డైరెక్ట్ తెలుగు సినిమాలతో.. ‘మన్యంపులి’.. ‘కనుపాప’ లాంటి డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకలకూ చేరువయ్యాడు లాల్. ఇప్పుడు ఆయన ‘ఒడియన్’ సినిమాతో మన ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ చిత్ర తెలుగు టీజర్ కూడా తాజాగా విడుదలైంది.

ఒడియన్ అంటే.. కేరళలోని ఒక తెగకు చెందిన మనుషులు. అటవీ ప్రాంతంలో తిరిగే వీళ్లు రకరకాల అవతారాల్లోకి మారిపోయి విస్మయ పరుస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు జంతువుల్లా కూడా కనిపిస్తారు. దీని మీద ‘లెజెండ్ ఆఫ్ ఒడియన్’ అనే పుస్తకం కూడా వచ్చింది. దాని ఆధారంగానే శ్రీకుమార్ మీనన్ ‘ఒడియన్’ సినిమాను రూపొందించాడు. నటన విషయంలో ఎంతకీ దాహం తీరని లాల్.. ఒడియన్ పాత్రలో చెలరేగిపోయినట్లే ఉన్నాడు. ఈ చిత్ర పోస్టర్లపై ‘మోహన్ లాల్ నట విశ్వరూపం’ అని వేస్తున్నారు. టీజర్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. రకరకాల అవతారాల్లో కనిపించిన లాల్.. కళ్లతోనే మ్యాజిక్ చేశాడు.

ఇంటెన్సిటీ చూపించాడు. ఆయన లుక్ కూడా వైవిధ్యంగా ఉంది. ఈ పాత్ర కోసం బరువు తగ్గి తన శరీరాన్ని రకరకాల అవతారాల్లోకి మార్చుకున్నాడాయన. మరో లెజెండరీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఇందులో కీలక పాత్ర చేయడం విశేషం. నటన విషయంలో ఇద్దరూ పోటీ పడతారనడంలో సందేహం లేదు. ఈ నెలలోనే మలయాళం-తమిళం-తెలుగు భాషల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English