గోల్డెన్ ఛాన్స్.. ఉపయోగించుకుంటాడా?

గోల్డెన్ ఛాన్స్.. ఉపయోగించుకుంటాడా?

గత ఏడాది తెలుగులో వచ్చిన అత్యంత చెత్త సినిమాల్లో ‘ఉంగరాల రాంబాబు’ ఒకటి. ఈ మాట చెప్పడానికి మొహమాట పడాల్సిన అవసరమే లేదు. ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లాంటి మంచి సినిమాలు తీసిన క్రాంతి మాధవన్ చిత్రం కదా అని థియేటర్లకు వెళ్లిన వాళ్లకు చుక్కలు కనిపించాయి. ఈ చిత్రం మామూలుగా హింసించలేదు జనాల్ని. ఇలాంటి సినిమా తీశాక ఆ దర్శకుడికి ఇంకో అవకాశం దక్కడమే కష్టం.

అలాంటిది విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ హీరోతో సినిమా తీసే ఛాన్స్ రావడమంటే మామూలు విషయం కాదు. క్రాంతితో పని చేయడానికి ముందే కమిట్మెంట్ ఇచ్చిన విజయ్.. మాట తప్పకుండా ఈ సినిమాను పట్టాలెక్కించాడు. ఇంతకుముందు క్రాంతితో ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ను నిర్మించిన సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావే ఈ చిత్రాన్నీ ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

కొన్ని రోజుల కిందటే క్రాంతి-విజయ్ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ఈ చిత్రంలో విజయ్ సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తున్నారు. విజయ్‌కి స్టార్ ఇమేజ్ లేనపుడు ఒప్పుకున్న ‘ట్యాక్సీవాలా’ విషయంలో విజయ్ అభిమానులు చాలా టెన్షన్ అనుభవించారు. అది ఆశ్చర్యకర రీతిలో హిట్టయిపోయింది. మరి ఇలాగే కమిట్ అయిన క్రాంతి సినిమా ఏమవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ‘ఉంగరాల రాంబాబు’ సినిమా చూస్తే అది ఎంతమాత్రం క్రాంతి మాధవ్ సినిమాలా కనిపించదు. ‘ఓనమాలు’.. ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాల్లో దర్శకుడిగా తనదంటూ ఒక శైలి చూపించాడు క్రాంతి. వాటిలో ఉండే ఫీలే వేరు. ఎమోషన్లు వేరు.

ఇప్పుడు విజయ్ సినిమాలో అలాంటి ముద్రే చూపించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. దానికి తోడు విజయ్ ఇమేజ్‌కు తగ్గ వినోదాన్ని కూడా ఆశిస్తున్నారు. ఏదేమైనప్పటికీ తన గత సినిమా ఫలితాన్ని.. అందులో తన పనితనాన్ని ఎంతమాత్రం దృష్టి ఉంచుకోకుండా క్రాంతికి విజయ్ ఛాన్సివ్వడం గొప్ప విషయమే. ‘ఉంగరాల రాంబాబు’ లాంటి సినిమా తర్వాత విజయ్ లాంటి క్రేజీ హీరోను డైరెక్ట్ చేయడం అంటే అద్భుతమైన అవకాశమే. దీన్ని అతనెలా ఉపయోగించుకుంటాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English