ధనుష్ కాదు.. సాయిపల్లవి హైలైట్

ధనుష్ కాదు.. సాయిపల్లవి హైలైట్

తమిళ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ట్రైలర్ రానే వచ్చింది. స్టార్ హీరో ధనుష్ నటించిన ‘మారి-2’ ఈ రోజే ట్రైలర్‌తో అభిమానుల్ని పలకరించింది. కొన్నేళ్ల కిందట వచ్చిన ‘మారి’కి ఇది సీక్వెల్. ‘మారి’ సరిగా ఆడకపోయినా.. ఈ చిత్రానికి సీక్వెల్ తీయడం విశేషం.

ఐతే ట్రైలర్ చూస్తే ‘మారి’తో పోలిస్తే ఇది బాగానే ఉండేలా కనిపిస్తోంది. ఎక్కువగా ప్రయోగాలు చేసే ధనుష్.. అప్పుడప్పుడూ ఊర మాస్ సినిమాలు చేస్తుంటాడు. ఆ కోవలోనే ఉంది ‘మారి-2’. ధనుష్ పూర్తిగా మాస్‌ను అలరించే పాత్రలో కనిపించనున్నాడు.

‘‘ఇఫ్ యు ఆర్ బ్యాడ్. ఐయామ్ యువర్ డాడ్’’ అంటూ అతను చెప్పిన డైలాగ్ ట్రైలర్‌కు ప్రత్యేక ఆకర్షణ. తన గురించి జనాలు మంచిగా మాట్లాడుకుంటున్నారు అంటే షాకవ్వడం.. హీరోయిన్ తనను ‘రౌడీ బేబీ’ అంటూ ఆటపట్టిస్తే గింజుకోవడం.. ఇవన్నీ బాగా వినోదం పంచేలా ఉన్నాయి.

ఐతే ఆల్రెడీ ‘మారి’లో ధనుష్‌ను ఈ పాత్రలో చూడటం వల్ల అతడి లుక్, యాక్టింగ్ కొత్తగా ఏమీ అనిపించట్లేదు. ‘మారి-2’లో అతడి కంటే సాయిపల్లవి పాత్ర ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఆటోడ్రైవర్ ఆరాదు ఆనంది పాత్రలో సాయిపల్లవి చెలరేగిపోయినట్లుంది. మంచి పెర్ఫామర్లయిన ధనుష్-సాయిపల్లవి పోటీ పడి నటించినట్లున్నారు.

వాళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాలో మరో హైలైట్ అయ్యేలా ఉంది. సినిమా కథ అయితే రొటీన్‌గానే అనిపిస్తోంది కానీ.. ఎంటర్టైన్మెంట్‌కు మాత్రం ఢోకా లేనట్లే ఉంది. ‘సర్కార్’లో విలన్ పాత్ర పోషించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించింది. తెలుగులో ‘లవ్ ఫెయిల్యూర్’ చిత్రాన్ని అందించిన బాలాజీ మోహన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ధనుషే ఈ సినిమాను నిర్మించాడు. డిసెంబరు 21న ‘మారి-2’ ప్రేక్షకుల ముందుకు రానుంది. అక్టోబర్లో ‘వడ చెన్నై’తో హిట్ కొట్టిన ధనుష్.. మరోసారి బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English