56 వేల స్క్రీన్లలో 2.0 రిలీజ్

56 వేల స్క్రీన్లలో 2.0 రిలీజ్

‘2.0’ విడుదలై ఆల్రెడీ ఆరు రోజులు దాటగా.. మళ్లీ కొత్తగా రిలీజ్ ఏంటి.. అందులోనూ 56 వేల స్క్రీన్లేంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఇది ఇండియాలో రిలీజ్ సంగతి కాదులెండి. శంకర్ తీర్చిదిద్దిన ఈ విజువల్ వండర్ చైనాలో కొన్ని నెలల తర్వాత విడుదల కాబోతోంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ పెద్ద ప్రెస్ నోట్ ఇచ్చింది చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. చైనాలో పేరొందిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన హై మీడియా సంస్థ భాగస్వామ్యంలో ‘2.0’ను రిలీజ్ చేయబోతోంది లైకా ప్రొడక్షన్స్. వచ్చే ఏడాది మే నెలలో అక్కడ భారీ స్థాయిలో ‘2.0’ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

చైనాలో ఏకంగా 10 వేల థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తారట. ఐతే స్క్రీన్ల సంఖ్య మాత్రం 56 వేలుగా ఉండబోతోందట. అందులో త్రీడీ స్క్రీన్లు మాత్రమే 46 వేలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. చైనాలో ఈ చిత్రాన్ని అగ్రెసివ్‌గా ప్రమోట్ చేయాలని కూడా ‘2.0’ టీమ్ యోచిస్తోందట. శంకర్, రజనీకాంత్ కూడా చైనాకు వెళ్లే అవకాశముంది. కొన్నేళ్ల ముందు వరకు చైనా మార్కెట్లోకి ఇండియన్ సినిమా విడుదల కావడమే చాలా కష్టంగా ఉండేది. అక్కడ మన సినిమాల్ని రిలీజ్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. కానీ అమీర్ ఖాన్ వరుసగా తన సినిమాల్ని అక్కడికి తీసుకెళ్లి మార్కెట్ క్రియేట్ చేశాడు. ‘దంగల్’ సినిమా అక్కడ అద్భుత విజయం సాధించి.. ఏకంగా రూ.1200 కోట్ల దాకా వసూళ్లు కొల్లగొట్టింది. అక్కడి నుంచి వరుసగా మన సినిమాల్ని అక్కడ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు సీక్రెట్ సూపర్ స్టార్, హిందీ మీడియం, భజరంగ్ భాయిజాన్, బాహుబలి లాంటి సినిమాలు అక్కడ బాగా ఆడాయి.. ‘2.0’ అమీర్ సినిమాల కంటే పెద్ద స్థాయిలో రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English