అందుకే పొత్తుల‌న్న ప‌వ‌న్‌

రాజ‌కీయాల్లో ప‌వ‌న్ అనుస‌స్తున్న వైఖ‌రి ఏమిటో అర్థం కావ‌డం లేదు? ఒక‌సారి పొత్తులు అంటారు? మ‌రోసారి ఒంట‌రిగానే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తామ‌ని చెప్తారు? ఇలా ప్ర‌జ‌ల్లో ఎన్నో అనుమానాలున్న సంగ‌తి తెలిసిందే. దీనిపై ఇప్ప‌టివ‌ర‌కూ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కూడా ఓ స్ప‌ష్ట‌త ఇవ్వ‌కపోవ‌డం అందుకు కార‌ణం. అయితే తాజాగా అందంతా త‌న వ్యూహ‌మ‌ని.. అవ‌స‌రాల‌కు అనుగుణంగా త‌న వ్యూహాన్ని మారుస్తుంటాన‌ని ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్న అది ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి కోస‌మేన‌ని ప‌వ‌న్ వెల్ల‌డించారు.

2014లో జ‌న‌సేన‌ను స్థాపించి.. ప్ర‌శ్నించ‌డానికే రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నానంటూ ప్ర‌క‌టించి దూసుకొచ్చిన ప‌వ‌న్ ఇప్ప‌టివ‌ర‌కూ ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఆటుపోట్ల ప్ర‌యాణాన్ని కొన‌సాగిస్తున్నారు. పార్టీ స్థాపించిన ఏడాది ఎన్నిక‌ల్లో ఇటు ఏపీలో టీడీపీతో.. అటు కేంద్రంలోని బీజేపీతో చేతులు క‌లిపారు. ఆయా పార్టీల విజ‌యం కోసం ప‌ని చేశారు. రాష్ట్రంలో టీడీపీ.. కేంద్రంలో బీజేపీ స‌ర్కారులు కొలువుదీరాయి. అయితే ఆ త‌ర్వాత రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌డంలో మోడీ ప్ర‌భుత్వం విఫ‌లం కావ‌డంతో బీజేపీతో సంబంధం తెంచుకున్న ప‌వ‌న్‌.. ఇటు టీడీపీతోనూ పొత్తు వ‌దులుకుని 2019 ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ఘోరంగా ఓట‌మి మూట‌గ‌ట్టుకుంది. ప‌వ‌న్ పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు. ఆ పార్టీ త‌ర‌పున కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్ర‌మే గెలిచారు.

ఇక ఇప్పుడు జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా తిరిగి బీజేపీతో పోత్తులో కొన‌సాగుతున్నారు. ఇప్పుడు ఆ బంధం కూడా తెంచుకునేందుకు పవ‌న్ సిద్ద‌మ‌య్యార‌ని స‌మాచారం. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీవ‌క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేయాల‌ని నిర్ణ‌యించుకున్న ఆయ‌న‌.. ఆ కార‌ణంతో బీజేఈతో తెగ‌దెంపులు చేసుకునే ఆస్కారం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక ఏపీలో ఇటీవ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కాస్త మెరుగైన ఫ‌లితాలు సాధించ‌డంతో ఉత్సాహంలో ఉన్న ప‌వ‌న్‌.. త‌న మేన‌ళ్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా రిప‌బ్లిక్ ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుక‌లో సీఎం జ‌గ‌న్‌పై ఏపీ ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ సంగ‌తి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రులు తీవ్రంగానే స్ప‌దించ‌డంతో ప‌వ‌న్ కూడా అదే స్థాయిలో ఘాటు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా ప‌వ‌న్ పొత్తుల గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు. త‌న‌కు స‌రైన సిద్ధాంతం లేద‌ని సందిగ్ధంలో ఉంటాన‌ని ఒక‌సారి ఒక మాట చెప్పి త‌ర్వాత మ‌రో పార్టీతో క‌లుస్తావేంట‌ని త‌న‌ను ప్ర‌శ్నిస్తార‌ని కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇదంతా త‌న వ్యూహంలో భాగ‌మ‌ని ప‌వ‌న్ చెప్పారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఆ వ్యూహం మారుస్తుంటాన‌ని పేర్కొన్నారు. దీన్ని బట్టి ఆయ‌న ఇప్పుడు బీజేపీకి గుడ్‌బై చెప్ప‌డం దాదాపు ఖాయ‌మైంద‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. అలాగే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించ‌డ‌మే ల‌క్ష్యంగా తిరిగి టీడీపీతో క‌లుస్తార‌నే అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ప‌వ‌న్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.