దక్షిణాదిన మరో మెగా మూవీ మొదలైంది

దక్షిణాదిన మరో మెగా మూవీ మొదలైంది

బాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలు ట్రై చేసినపుడల్లా ఎదురు దెబ్బలే తగిలాయి. ఒకప్పుడు హిందీ సినిమాల బడ్జెట్ రూ.50 కోట్లను దాటని రోజుల్లోనే 'తాజ్ మహల్' అనే చిత్రాన్ని 70 కోట్లకు పైగా బడ్జెట్‌ తో తీసి నిర్మాత నిండా మునిగాడు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ రూ.180 కోట్లతో 'రా.వన్' తీస్తే అదీ తుస్సుమనిపించింది. ఇటీవలే రిలీజైన అమీర్ ఖాన్ సినిమా 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'ను రూ.250  కోట్లతో తీశారు.

మధ్యలో కొన్ని భారీ బడ్జెట్ సినిమాలు ఆడాయి కానీ.. ఒక స్థాయికి మించి ఖర్చు చేస్తే మాత్రం వర్కవుట్ కావడట్లేదు. దీంతో బడ్జెట్ల విషయంలో బాలీవుడ్ జనాలు భయపడుతున్నారు. ఐతే దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న హిందీ సినిమాల పరిస్థితి అలా ఉంటే.. దక్షిణాదిన మాత్రం చాలా ధైర్యంగా బడ్జెట్లను కొండెక్కించేస్తున్నారు.

మన దర్శక ధీరుడు రాజమౌళి ఏకంగా రూ.450 కోట్లతో 'బాహుబలి' రెండు భాగాలు తీశాడు. శంకర్ '2.0' ఒక్క సినిమా మీదే రూ.545 కోట్లు పెట్టించాడు. జక్కన్న కొత్త సినిమా బడ్జెట్ రూ.300 కోట్ల దాకా ఉండొచ్చని అంటున్నారు. సుందర్.సి 'సంఘమిత్ర' అనే సినిమాను రూ.250 కోట్లతో తీయాలనుకుంటున్నాడు కానీ.. దానికి మధ్యలో బ్రేక్ పడింది.

ఇవన్నీ కాక ఇప్పుడు మరో మెగా బడ్జెట్ మూవీ దక్షిణాదిన శ్రీకారం చుట్టుకుంది. సీనియర్ హీరో విక్రమ్ హీరోగా 'మహవీర్ కర్ణ' అనే సినిమా తెరకెక్కనుందని ఆ మధ్య వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. మధ్యలో ఈ సినిమా గురించి ముచ్చట్లేమీ లేకపోవడం అది ఆగిందనుకున్నారు. కానీ చడీచప్పుడు లేకుండా ఈ చిత్ర ప్రారంభోత్సవాన్ని మంగళవారం జరిపించారు.

కేరళలోని ఒక గుడిలో చిత్ర దర్శక నిర్మాతలు పూజలు జరిపించి సినిమాను లాంఛనంగా ఆరంభించారు. ఈ కార్యక్రమంలో విక్రమ్ పాల్గొనలేదు. ఈ చిత్రాన్ని పదికి పైగా భారతీయ భాషల్లో తీస్తారట. బడ్జెట్ రూ.300 కోట్లకు పైమాటేనట. ఆర్.ఎస్.విమల్ ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. కర్ణుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English