రాజమౌళి తండ్రి వదిలేది లేదంటున్నాడు

రాజమౌళి తండ్రి వదిలేది లేదంటున్నాడు

తండ్రికి తగ్గ తనయుడు అంటుంటాం. కానీ తనయుడికి తగ్గ తండ్రి అనిపించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించడం అరుదుగా జరుగుతుంటుంది. విజయేంద్ర ప్రసాద్ అదే చేస్తున్నట్లుగా ఉంది.
రచయితగా ఎంత గొప్ప పేరు సంపాదించినప్పటికీ.. దర్శకుడిగా తనేంటో రుజువు చేసుకోవాలన్న తపన మాత్రం విజయేంద్ర ప్రసాద్‌లో ఇంకా ఉన్నట్లే ఉంది.

కొడుకు రాజమౌళితో కలిసి పని చేయడానికంటే ముందే ఆయన.. ‘బొబ్బిలి సింహం’, ‘సమరసింహా రెడ్డి’ లాంటి సినిమాలతో రచయితగా సత్తా చాటాడాయన. రాజమౌళి సినిమాలతో రచయితగా ఇంకా గొప్ప పేరొచ్చింది. ఐతే 60 ఏళ్లు పైబడ్డాక ‘శ్రీకృష్ణ 2006’ అనే సినిమాతో దర్శకుడిగా మారారాయన. ఆ సినిమా పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ‘రాజన్న’ అనే సినిమా తీశాడు. అది బాగానే ఆడింది. కానీ చివరగా తీసిన ‘శ్రీ వల్లి’ మాత్రం డిజాస్టర్ అయింది.

ఈ దెబ్బతో విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం జోలికి వెళ్లడనే అంతా అనుకున్నారు. పైగా ఇప్పుడు ఆయన వయసు 76 ఏళ్లు కావడంతో మళ్లీ దర్శకత్వం చేపట్టేంత ఓపిక కూడా ఆయనకు ఉండదనే భావిస్తున్నారు. కానీ ఆయన ఆలోచన మాత్రం వేరుగా ఉంది. మళ్లీ కచ్చితంగా దర్శకత్వం చేస్తానంటున్నారు విజయేంద్ర. అంతే కాదు.. వచ్చే ఏడాదే తన డైరెక్షన్లో కొత్త సినిమా మొదలవుతుందని ఆయన చెప్పారు.

ఈసారి తాను చేయబోయేది భారీ సినిమా అని.. అందులో ఒక స్టార్ హీరో కూడా నటిస్తాడని ఆయన చెప్పారు. తాను తీసిన మూడు సినిమాల్లో ఒక్కటే ఫెయిలైందని.. మిగతా రెండూ సంతృప్తినిచ్చాయని.. ముఖ్యంగా ‘రాజన్న’ తనకెంతో నచ్చిన సినిమా అని చెప్పారాయన. ఇక దర్శకత్వం చేయకూడదన్న ఆలోచన తనకెప్పుడూ రాలేదని.. తన వయసు 76 ఏళ్లయినప్పటికీ.. మనసు మాత్రం 35 ఏళ్లదే అని ఆయన చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English