కేటీఆర్ నోట.. మహేష్ సినిమా మాట

కేటీఆర్ నోట.. మహేష్ సినిమా మాట

తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి మిత్రులన్న సంగతి తెలిసిందే. ‘భరత్ అనే నేను’ రిలీజ్ తర్వాత ఇద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొని తమ మధ్య ఉన్న స్నేహం గురించి మాట్లాడటం తెలిసిందే. అప్పుడు వాళ్లిద్దరి సంభాషణ చాలా సరదాగా సాగింది. వీళ్లిద్దరి మధ్య ఇంత స్నేహం ఉందని తెలిసి ఇరువురి అభిమానులూ సంతోషించారు. విశేషం ఏంటంటే.. ప్రస్తుతం ఎన్నికల హడావుడిలో ఉన్న కేటీఆర్ ఓ కార్యక్రమంలో భాగంగా మహేష్ చివరి సినిమా ‘భరత్ అనే నేను’ ప్రస్తావన తేవడం విశేషం. ప్రజలతో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో భాగంగా కేటీఆర్ ఈ సినిమా గురించి మాట్లాడారు.

‘భరత్ అనే నేను’లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన జనాలపై ముఖ్యమంత్రి అయిన మహేష్ బాబు భారీగా జరిమానాలు విధిస్తాడు. దీనిపై జనాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కి తగ్గడు. అదే సరైన పరిష్కారం అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ ఎపిసోడ్ గురించి కేటీఆర్ ప్రస్తావించాడు. ఈ సినిమా చూసిన జనాలు.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇలాగే చేయొచ్చు కదా.. కఠినంగా వ్యవహరించవచ్చు కదా అని అన్నారని.. కానీ సినిమాల్లో చూపించేదానికి.. నిజ జీవితంలో జరిగే దానికి చాలా తేడా ఉంటుందని కేటీఆర్ అన్నారు. తాను మహేష్ కు కూడా ఈ విషయం చెప్పానన్నారు. నిజ జీవితంలో ప్రాక్టికల్ సమస్యలు చాలా ఉంటాయని.. అన్నీ అనుకున్నంత సులువు కాదని.. ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోలేమని అన్నారు.

ఇండియాలో ఏదైనా చల్తా అనే అభిప్రాయం జనాల్లో ఉందని.. ఇలా తేలిగ్గా తీసుకునే జనాల్లో తాను కూడా ఉంటానని.. మనకు ఏళ్ల తరబడి అలాంటి మనస్తత్వం అలవాటైపోయిందని ఆయన అన్నారు. తాను కుటుంబంతో కలిసి సింగపూర్‌కు వారం రోజుల వెకేషన్ కోసం వెళ్లానని.. అక్కడ రోడ్డుపై చెత్త వేస్తే జైల్లో పెడతారని.. ఇది తెలిసి తన కూతురు ఆశ్చర్యపోయిందని.. ఆ వారం రోజులు చాలా జాగ్రత్తగా నడుచుకుందని.. కానీ తిరిగి హైదరాబాద్ వచ్చాక యథా ప్రకారం తయారైందని.. మన యాటిట్యూడ్ ఇలాగే ఉంటుందని కేటీఆర్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English