సంస్కారం గురించి పవన్ మాట్లాడడమా?:కన్నబాబు

వైసీపీ నేతలు వర్సెస్ పవన్ కల్యాణ్ మాటల యుద్ధం తార స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ విధానాలపై, సీఎం జగన్ పాలనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ దుమారానికి తెరలేపాయి. వైసీపీ మంత్రులు సన్నాసులంటూ పవన్ చేసిన కామెంట్లపై వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. ఇప్పటికే పవన్ సన్నాసిన్నర సన్నాసి అంటూ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇవ్వగా…తాజాగా పవన్ కామెంట్లపై మంత్రి కురసాల కన్నబాబు ఘాటుగా స్పందించారు.

ఒక పార్టీకి వ్యవస్థాపకుడైన పవన్ కల్యాణ్…నిర్మాతలు, దర్శకులకు కులాలు ఆపాదిస్తూ పబ్లిక్‌లో వ్యాఖ్యానించడం ఏమిటని కన్నబాబు ప్రశ్నించారు. మంత్రులను సన్నాసులంటున్న పవన్‌ సంస్కారం ఏపాటిదని కన్నబాబు నిలదీశారు. 2019 ఎన్నికల్లో రెండుచోట్లా ఓడిపోయిన పవన్…ఆ అవమాన భారం నుంచి బయటపడలేక తీవ్ర ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారని కన్నబాబు ఎద్దేవా చేశారు. ఆ కారణంతోనే సీఎం జగన్‌పై ఈర్ష్య, అసూయద్వేషాలతో రగిలిపోతున్నారని అన్నారు.

ఆన్ లైన్ లో సినిమా టికెట్ల విక్రయం వ్యవహారంపై కన్నబాబు స్పందించారు. టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు ఆన్‌లైన్‌ టికెట్‌ విధానం కావాలని కోరారని, కేంద్రంలో బీజేపీ కూడా ఈ విధానాన్నే కోరుతోందని కన్నబాబు తెలిపారు. ఈ విధానం పవన్‌ కు ఇష్టం లేకుంటే దానిని ఎత్తివేయాలని ప్రధాని మోదీని పవన్ కోరాలని కన్నబాబు సూచించారు. కేవలం జగన్ ను టార్గెట్ చేయడమే పనిగా పవన్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పదేపదే జగన్‌ను పవన్ లక్ష్యంగా చేసుకుని దూషించారని కన్నబాబు గుర్తు చేశారు. ఆనాడు సీఎంగా ఉన్న చంద్రబాబును పవన్ పల్లెత్తు మాటనలేదని, పవన్‌ బీజేపీతో ఉన్నా సరే చంద్రబాబుతో పవన్‌ స్నేహబంధం కొనసాగుతోందని అన్నారు. దేశంలో హుందాగా రాజకీయం చేసే అతి తక్కువ మంది నాయకుల్లో జగన్‌ ఒకరని, తన దగ్గర పనిచేసే అటెండర్‌ను కూడా అన్నా అని పిలిచే సంస్కారం ఉన్న వ్యక్తి జగన్ అని కొనియాడారు. కులం, మతం, రాజకీయం చూడబోమని చెప్పిన జగన్ అదే రీతిలో వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు.