ఆ సినిమాలో మంచు మనోజ్, సునీల్ కూడా..

ఆ సినిమాలో మంచు మనోజ్, సునీల్ కూడా..

ప్రస్తుతం సినీ ప్రియులందరి దృష్టంతా ‘2.0’ మీదే నిలిచి ఉండగా.. చడీచప్పుడు లేకుండా ఇంకో కొత్త సినిమా రిలీజవుతోంది తెలుగులో. శనివారం నాడు శ్రీకాంత్ చిత్రం ‘ఆపరేషన్ 2019’ను రిలీజ్ చేస్తున్నారు. ఇది చాలా కాలంగా విడుదల కోసం ఎదురు చూస్తున్న చిత్రం. గత ఏడాదే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కానీ శ్రీకాంత్ మార్కెట్ దారుణంగా దెబ్బ తినేసి.. ప్రేక్షకుల్లో అతడి సినిమా పట్ల ఏమాత్రం ఆసక్తి లేని నేపథ్యంలో విడుదలకు నోచుకోకుండా ఆగిపోయింది. ఐతే ఎలాగోలా ఇప్పుడీ చిత్రాన్ని బయటికి తీశారు. విడుదలకు సిద్ధం చేశారు. తెలంగాణలో ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో ఈ పొలిటికల్ మూవీ కొంతమేర జనాల దృష్టిని ఆకర్షిస్తుందని ఆశిస్తున్నారు.

దశాబ్దం కిందట వచ్చిన శ్రీకాంత్ సినిమా ‘ఆపరేషన్ దుర్యోధన’కు ఇది సీక్వెల్. తొలి భాగానికి పోసాని కృష్ణమురళి దర్శకత్వం వహించాడు. అది అప్పట్లో మంచి విజయమే సాధించింది. సీక్వెల్ ను కరణం బాబ్జీ డైరెక్ట్ చేశాడు. పోసాని తీసినా కొంచెం క్రేజ్ ఉండునేమో. కానీ ఆయన రచనకు.. దర్శకత్వానికి పూర్తిగా దూరమైపోయాడు. మరోవైపు శ్రీకాంత్ మార్కెట్ అన్నదే లేదు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ కు సాయపడటానికి మంచు మనోజ్.. సునీల్ కూడా ముందుకొచ్చారు. ఈ మధ్యే వీళ్ల మీద కొన్ని సీన్లు చిత్రీకరించారు.

వాటిని సినిమాకు జోడించారు. ఇప్పుడు పోస్టర్ల మీద వాళ్ల బొమ్మలేసి సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. కానీ మనోజ్, సునీల్‌ల మార్కెట్ కూడా అంతంతమాత్రంగానే ఉంది. వాళ్లకూ క్రేజ్ పడిపోయింది. ఈ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’కు వీళ్లెంతమేరకు లాభం చేకూరుస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English