ఇంకెవరు చూస్తారు ఈ జబర్దస్త్?

ఇంకెవరు చూస్తారు ఈ జబర్దస్త్?

ఎవరెన్ని విమర్శలైనా చేయనీ.. ఎన్ని తిట్లైనా తిట్టనీ.. ‘జబర్దస్త్’ అనే ప్రోగ్రాం టెలివిజన్ ఎంటర్టైన్మెంట్లో ఒక సంచలనం అన్నది మాత్రం అంగీకరించాల్సిన విషయం. కొన్నేళ్లుగా ఇది నంబర్ వన్ టీవీ షో అనడంలో కూడా సందేహం లేదు. ఇందులోని కంటెంట్ అభ్యంతరకరంగా ఉండే మాట వాస్తవం. కానీ జనాలు అదే చూస్తున్నారు. దాన్నే ఆదరిస్తూ వస్తున్నారు.

యూట్యూబ్‌లో ఒక్కో స్కిట్‌కు వచ్చే వ్యూస్ చూస్తేనే ఆ షోకు ఎలాంటి ఆదరణ ఉందో స్పష్టమవుతుంది. విమర్శల్ని, వ్యతిరేకతను తట్టుకుని కూడా షో విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడా షోకు బీటలు వారినట్లే కనిపిస్తోంది. ‘జబర్దస్త్’కు ప్రధాన ఆకర్షణగా ఉంటూ వచ్చిన హైపర్ ఆది షో నుంచి తప్పుకోవడం దీనిపై చాలా ప్రభావమే చూపించింది.

గురువారం వచ్చే ‘జబర్దస్త్’కు ప్రధాన బలం హైపర్ ఆది స్కిట్టే. అతడి స్కిట్‌కు ముందు, వెనుక వచ్చే వాటిపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు జనాలకు. యూట్యూబ్‌లో సైతం ఆది స్కిట్‌కే భారీ వ్యూస్ వచ్చేవి. ఇలా షోను తనే ఒంటి చేత్తో నిలబెడుతూ వచ్చేవాడు. కానీ అతను గత నెలలో ‘జబర్దస్త్’కు దూరమయ్యాడు. ముందు ఇది టెంపరరీ బ్రేక్ అనుకున్నారు. కానీ తర్వాత తేలిందేమంటే.. అతను షోకు పూర్తిగా దూరం అయ్యాడని. దీంతో జబర్దస్త్ ఒక్కసారిగా కళ తప్పింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు యాంకర్ అనసూయ సైతం జబర్దస్త్‌కు దూరమైనట్లు వార్తలొస్తున్నాయి. ఆమె స్థానంలో మరో యాంకర్ వస్తోంది. ఇది కూడా ముందు తాత్కాలికమే అనుకున్నారు.  కానీ అనసూయ కూడా పూర్తిగా షో నుంచి తప్పుకుందని అంటున్నారు.

ఇదే నిజమైతే.. జబర్దస్త్ మరింతగా కళ తప్పడం ఖాయం. అనసూయ అందం, చలాకీతనం షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ వచ్చాయి. ఆమె కోసం షో చూసేవాళ్లూ లేకపోలేదు. హైపర్ ఆది-అనసూయల కాంబినేషన్.. వాళ్ల కెమిస్ట్రీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేది. ఇప్పుడు ఇద్దరూ దూరమయ్యారంటే ఇక జనాలు ఈ షోను ఎలా చూస్తారు? ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’లో సుడిగాలి సుధీర్ టీం, రష్మి గౌతమ్ లాంటి వాళ్లు కూడా తప్పుకుంటే.. మొత్తంగా ఈ షోకు టాటా చెప్పేయొచ్చేమో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English