కమల్ లుక్‌కి ఫిదా అంటున్న శంకర్

కమల్ లుక్‌కి ఫిదా అంటున్న శంకర్

సౌత్ ఇండియన్ ఏస్ శంకర్ ‘2.0’తో గురువారమే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీని తర్వాత అతను కమల్ హాసన్‌తో ‘భారతీయుడు-2’ తీయబోతున్న సంగతి తెలిసిందే. దాదాపు దశాబ్దంన్నర కిందట వచ్చిన ‘భారతీయుడు’ అప్పట్లో ఎంతటి సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ వస్తుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. అనేక అడ్డంకుల్ని దాటుకుని వచ్చే నెలలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లబోతోంది.

‘2.0’ ప్రమోషన్లలో భాగంగా ‘భారతీయుడు-2’ గురించి శంకర్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పటికే ఆ చిత్రానికి సన్నాహాలు మొదలయ్యాయన్నాడు. ఆల్రెడీ కమల్ హాసన్‌ లుక్ విషయంలో టెస్ట్ షూట్ జరిగిందన్నాడు. ఆయనకి పర్ఫెక్ట్ లుక్ సెట్ చేశామన్నాడు.

25 ఏళ్ల కిందట కమల్ ‘భారతీయుడు’లో ఎంత బాగా కనిపించాడో.. ఇప్పుడు కూడా అలాగే కనిపించబోతున్నట్లు శంకర్ చెప్పాడు. ఈ వయసులో కూడా కమల్ ఎనర్జీ.. ఫిట్నెస్ చూసి తాను ఆశ్చర్యపోయినట్లు చెప్పాడు. ‘భారతీయుడు’గా ఆయన లుక్ చూస్తే.. రోజంతా అలా చూస్తూనే ఉండాలనిపించిందని శంకర్ అన్నాడు.

‘భారతీయుడు’లో సేనాపతి పాత్ర దక్షిణాది ప్రేక్షకులకు అత్యంత నచ్చిన పాత్రల్లో ఒకటని.. దాని మీద ప్రేక్షకులకు ఎంత ప్రేమ ఉందో తనకూ అంతే ప్రేమ ఉందని.. దీన్ని మరోసారి చక్కగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నానని శంకర్ చెప్పాడు. ‘2.0’ విడుదలై నాలుగైదు రోజుల్లోనే ఈ సినిమా పనులు ఊపందుకుంటాయని అతను వెల్లడించాడు.

‘భారతీయుడు’ తీసే సమయానికి సమాజంలోని పరిస్థితులు ఒకలా ఉన్నాయని.. వాటిని ప్రతిబింబిస్తూ సినిమా తీశానని.. ఇప్పుడు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయని.. సమస్యలు ఇంకో రకంగా ఉన్నాయని.. వాటన్నింటినీ సినిమాలో చర్చించే ప్రయత్నం చేస్తానని శంకర్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English