టాలెంట్ చూపించినా అవకాశాల్లేవే..

టాలెంట్ చూపించినా అవకాశాల్లేవే..

తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యం చాలా తక్కువ. ఎప్పుడో కానీ.. హీరోయిన్లకు బలమైన పాత్రలు దక్కవు. అందులోనూ కొత్త హీరోయిన్లకు మంచి పాత్రలు దక్కడం అరుదు. ఐతే ‘చి ల సౌ' సినిమా అందుకు భిన్నం. ఇందులో నటించిన కొత్తమ్మాయి రుహాని శర్మకు గొప్ప పాత్ర దక్కింది. నిజానికి అందులో హీరో పాత్ర పరిమితం.

అది హీరోయిన్ సినిమా అని చెప్పొచ్చు. సుశాంత్ బాగానే చేశాడు కానీ.. అతడిని రుహాని బాగా డామినేట్ చేసింది. బలమైన వ్యక్తిత్వం ఉన్న.. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రను రుహాని చక్కగా పోషించింది. తెలుగులో తొలి సినిమా అయినప్పటికీ.. ఏ తడబాటు లేకుండా నటించింది. గ్లామర్‌కు పెద్దగా ప్రాధాన్యం లేని పాత్ర అయినా.. తన పెర్ఫామెన్స్‌తో రుహాని ప్రేక్షకులకు చేరువైంది.

ఐతే తొలి సినిమాలోనే ఇంత టాలెంట్ చూపించినా రుహానికి తెలుగులో మరో అవకాశం దక్కలేదు. హీరోయిన్ అంటే గ్లామర్ అన్న అభిప్రాయం బలంగా ఉండటం వల్లో ఏమో.. ట్రెడిషనల్ లుక్‌లో రుహానిని చూసి ఛాన్సులివ్వట్లేదనిపిస్తోంది. ఐతే రుహాని తనలోని గ్లామర్ యాంగిల్ కూడా చేస్తోంది. ‘చి ల సౌ'లో కనిపించిన దానికి భిన్నంగా గ్లామరస్‌ లుక్స్‌తో తరచుగా ఫొటో షూట్లు చేస్తోంది.

వాటిలో ఆమెను చూసి.. ‘చి ల సౌ'లో చూసిన అమ్మాయి ఈమేనా అని ఆశ్చర్యపోతున్నారు. నటనకు తోడు గ్లామర్ కూడా ఉన్న ఈ అమ్మాయికి ఇకనైనా అవకాశాలు వస్తాయేమో చూడాలి. రుహానికి ఇంతకుముందు తమిళంలో ఒక సినిమా చేసింది కానీ.. అది ఆడలేదు. ‘చి ల సౌ' కమర్షియల్ సక్సెస్ అయితే ఇక్కడ కెరీర్ ఊపందుకునేదేమో. మరి మున్ముందైనా ఆమెకు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English