ఎన్నాళ్ల‌కెన్నాళ్ల‌కు.. మ‌ళ్లీ ల‌గ‌డ‌పాటి పేరు

ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విభ‌జించి తెలంగాణ‌ను ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయ‌డానికి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీకి త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసి చెప్పిన మాట ప్ర‌కారం రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్న నాయ‌కుడు. మ‌రి ఇప్పుడు ఆయ‌న గురించి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చింది అంటారా? ఆయ‌న‌ను తిరిగి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి తీసుకొచ్చే దిశ‌గా ప‌రిణామాలు మారుతుండ‌డ‌మే అందుకు కార‌ణం.

2004లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున విజ‌య‌వాడ నుంచి పార్ల‌మెంట్ స‌భ్యుడిగా గెలుపొందిన ల‌గ‌డ‌పాటి 2014 వ‌ర‌కూ తిరుగులేని నాయ‌కుడిగా కొన‌సాగారు. కానీ ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్య‌మానికి వ్య‌తిరేకంగా ఆయ‌న త‌న వైఖ‌రి ప్ర‌ద‌ర్శించారు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను విడ‌గొట్టేందుకు వీల్లేద‌ని త‌న గ‌ళాన్ని వినిపించారు. లోక్‌స‌భ‌లో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్ర‌వేశ‌పెట్టిన స‌మ‌యంలో ఆయ‌న స‌భ‌లో పెప్ప‌ర్ స్ప్రే చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డితే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటునాన‌ని ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. 2014లో ఎంపీ ప‌ద‌వితో పాటు కాంగ్రెస్ పార్టీని వీడారు. అప్ప‌టి నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు.

2019 ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కూ స‌ర్వేల‌తో ల‌గ‌డ‌పాటి వార్త‌ల్లో నిలిచారు. కానీ తెలంగాణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆయ‌న చేసిన స‌ర్వే ఫ‌లితాలు తారుమార‌య్యాయి. ఏపీలో తిరిగి చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడ‌తార‌ని జ‌గ‌న్‌కు ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం లేద‌ని ల‌గ‌డ‌పాటి చెప్పారు. కానీ అవ‌న్నీ రివ‌ర్స్ అయ్యాయి. ఇక అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎక్కువ‌గా క‌నిపించ‌డం లేదు. అయితే ఇప్పుడు తాజాగా ఏపీ టీడీపీలో ఆయ‌న పేరు వినిపిస్తోంది. ప్ర‌స్తుత విజ‌య‌వాడ పార్ల‌మెంట్ స‌భ్యుడు కేశినేని నాని వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోన‌ని బాబుకు స్ప‌ష్టం చేయ‌డంతో ఆ స్థానంలో ల‌గ‌డ‌పాటిని బ‌రిలో దించేందుకు పార్టీ ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఈ విష‌యంలో నానికి వ్య‌తిరేకంగా ఉన్న పార్టీలోని నేత‌లు ల‌గ‌డ‌పాటిని సంప్ర‌దించేందుకు సిద్ధ‌మైన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని గ‌ట్టిగా వ్య‌తిరేకించిన ఆయ‌న ప‌ట్ల విజ‌య‌వాడ ప్ర‌జ‌ల‌కు మంచి అభిప్రాయమే ఉంది. పైగా రాజ‌కీయ జీవితాన్ని కూడా వ‌దులుకున్నార‌నే సానుభూతి ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున ల‌గ‌డ‌పాటిని బ‌రిలో దించేందుకు ఆ పార్టీ నేత‌లు బుద్దా వెంక‌న్న బొండా ఉమ‌తో పాటు మ‌రికొంత మంది భావిస్తున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. అయితే రాజ‌కీయ స‌న్యాసం తీసుకున్నాన‌ని ప్ర‌క‌టించిన ల‌గ‌డ‌పాటిని ఈ నేత‌లు మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేలా ఒప్పించ‌గ‌లుగుతారా? అన్న‌దే ఇక్క‌డ స‌మాధానం వెత‌కాల్సిన ప్ర‌శ్న‌. ఒక‌వేళ ఆయ‌న మ‌న‌సు మార్చుకుని పార్టీలోకి వ‌స్తే అది టీడీపీకీ మేలు చేస్తుంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రి ల‌గ‌డ‌పాటి ఏ నిర్ణ‌యం తీసుకుంటారో? చూడాలి.