ఇంతకీ తేజు కండిషనేంటి..?

సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై రెండు వారాలు దాటింది. అతడికి ప్రాణాపాయం తప్పింది కానీ.. తగిలిన గాయాలు చిన్నవైతే కాదు. అందుకే రెండు వారాల తర్వాత కూడా ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదు. వారం రోజులకు పైగానే తేజు ఐసీయూలో ఉన్నాడు. అతడికో సర్జరీ అవసరమైంది. కొన్ని రోజుల పాటు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీన్ని బట్టి గాయాల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ఐతే తేజు హెల్త్ బులిటెన్లను ఫాలో అవుతున్న వాళ్లకు అతడి పరిస్థితి రోజు రోజుకూ మెరుగవుతూనే ఉందన్న సమాచారం అందుతూనే ఉంది. తేజు తెలివిలోకి వచ్చినట్లు కూడా ఇప్పటికే హెల్త్ బులిటెన్ ద్వారా స్పష్టం చేశారు. కానీ నిన్న తేజు సినిమా ‘రిపబ్లిక్’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన పవన్ కళ్యాణ్ మాత్రం తన మేనల్లుడు ఇంకా కోమాలో ఉన్నాడంటూ ఒక కామెంట్ చేసి అందరిలోనూ అయోమయం సృష్టించాడు.

తేజు బాగా కోలుకున్నాడని, అతడి విషయంలో ఆందోళన అక్కర్లేదని అందరూ ప్రశాంతంగా ఉన్న టైంలో పవన్ చేసిన ‘కోమా’ కామెంట్ ఒకింత కలవరం రేపింది. తేజు గురించి అందరూ ఆందోళన చెందుతున్నారు. మెగా అభిమానులు కంగారు పడతారన్న ఉద్దేశంతో అతడి వాస్తవ పరిస్థితిని వెల్లడించలేదా అన్న చర్చ మొదలైంది. కానీ వాస్తవానికి పవన్ అన్నట్లు తేజు కోమాలో ఏమీ లేడన్నది మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాల సమాచారం.

పవన్ చూసినప్పటికీ అతను తెలివిలో లేకపోవడం.. అలా అతణ్ని చూసిన దృశ్యం ముద్రపడిపోయి.. పవన్ భావోద్వేగంలో ‘కోమా’ అనే మాట మాట్లాడి ఉంటాడని.. ఆ తర్వాత కొంచెం సర్దుకుని ఇంకా కళ్లు తెరిచాడో లేదో తనకు తెలియదని అనడాన్ని బట్టి.. పవన్ అన్నది తేజు ప్రస్తుత పరిస్థితి గురించి కాదని అర్థం చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజుల్లోనే తేజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతాడన్నది మెగా ఫ్యామిలీ నుంచి అందుతున్న సమాచారం. అది జరిగితే తేజు పరిస్థితిపై క్లారిటీ వచ్చేసినట్లే.