అమీర్‌ పై ట్రోలింగ్.. అతను హర్ట్

అమీర్‌ పై ట్రోలింగ్.. అతను హర్ట్

ఇండియాలో మరే హీరోకూ లేని క్రెడిబిలిటీ ఆమిర్ ఖాన్ సొంతం. మామూలుగా దర్శకుల్ని చూసి కళ్లు మూసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లిపోతుంటారు. ఫలానా దర్శకుడు సినిమా బాగా తీస్తాడని పేరుంటుంది. కానీ హీరో అయి ఉండి ఆమిర్ ఖాన్ ఇలాంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు. ఆమిర్ సినిమా అంటే చాలు.. దర్శకుడు ఎవరైనా పర్వాలేదు.. సినిమా బాగుంటుంది అనే నమ్మకం ప్రేక్షకుల్లో వచ్చింది.

ఈ నమ్మకంతోనే ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఈ చిత్రం ‘బాహుబలి’ రికార్డుల్ని బద్దలు కొట్టేస్తుందని కూడా ఆశించారు. కానీ అనుకున్నదొకటి. అయినది ఒకటి. ఈ చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అంచనాల్ని ఏమాత్రం అందుకోలేకపోయింది. ఎన్నడూ లేని విధంగా ఆమిర్ ఖాన్ తీవ్ర విమర్శలెదుర్కొన్నాడు. అతడిని.. అతడి సినిమాను దారుణంగా ట్రోల్ చేశారు నెటిజన్లు.

ఇది ఆమిర్ అభిమానుల్ని బాధించింది. ఆ అభిమానుల్లో నటుడు.. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఒకడు. అతను ఆవేదనతో ఒక ట్వీట్ పెట్టాడు. ఆమిర్ ఇండియన్ సినిమాల్లో విప్లవం తెచ్చాడని.. ఒంటి చేత్తో మన సినిమాల రాత మార్చాడని.. తన అభిరుచితో గొప్ప గొప్ప సినిమాలు అందించాడని.. కొన్నిసార్లు సొంత డబ్బులు పెట్టి సాహసాలు చేశాడని.. అలాంటి వాడిని ట్రోల్ చేయడం తగదని అతనన్నాడు.

ఆమిర్ అయినా సరే.. దశాబ్దానికి ఒక ఫ్లాప్ ఇస్తే అందులో ఆశ్చర్యం ఏముందని.. దీనికి ట్రోల్ చేయడం ఏంటని అతను ప్రశ్నించాడు. అతడి అభిప్రాయంతో మెజారిటీ నెటిజన్లు ఏకీభవించారు. కొందరు మాత్రం విభేదించారు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటే వినోదం అయిపోయింది. ట్రోల్ చేయడానికి ఎవరు దొరుకుతారా అని జనాలు కాచుకుని ఉంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే.. రెచ్చిపోతారు. ఎవ్వరినీ మినహాయించరు. ఆ ఒరవడినే ఆమిర్ విషయంలోనూ కొనసాగించారు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English