బన్నీ పార్టీలతో అదరగొడుతున్నాడు

బన్నీ పార్టీలతో అదరగొడుతున్నాడు

అల్లు అర్జున్ చివరి సినిమా ‘నా పేరు సూర్య’ డిజాస్టర్ అయింది. అతడి కొత్త సినిమాపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ బన్నీ మాత్రం తరచుగా పార్టీల్లో మునిగి తేలుతున్నాడు. అలాగని పబ్బుల్లో రోజూ జరిగే పార్టీల టైపు కావివి. తనవి కాని సినిమాలు సక్సెస్ అవుతుంటే.. ఆ చిత్రాల బృందాలకు బన్నీ పార్టీలు ఇస్తున్నాడు.

ముందుగా ‘నా పేరు సూర్య’ రిలీజైన వారం లోపే వచ్చి బ్లాక్ బస్టర్ అయిన ‘మహానటి’ చిత్ర బృందానికి బన్నీ పార్టీ ఇచ్చాడు. నిజానికి ఆ సినిమాతో బన్నీకి అసలే సంబంధం లేదు. కానీ టాలీవుడ్ తరఫున ఆ చిత్ర యూనిట్ కు అతను పార్టీ ఇచ్చాడు. అప్పుడు బన్నీ పెద్ద మనసు గురించి అందరూ గొప్పగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత బన్నీ తన బేనర్లో తెరకెక్కిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్ర బృందానికీ పార్టీ ఇచ్చి మరోసారి వార్తల్లో నిలిచాడు.

ఇప్పుడు బన్నీ మరో పార్టీ ఇచ్చాడు. అది కూడా తన బేనర్లో తెరకెక్కిన సినిమాకే. విజయ్ దేవరకొండతోనే ‘గీతా ఆర్ట్స్’ తీసిన ‘ట్యాక్సీవాలా’ కూడా హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ‘గీత గోవిందం’కు సపోర్టిచ్చినట్లే ఈ చిత్రానికి కూడా ప్రమోషన్లలో సాయం చేశాడు బన్నీ. ప్రి రిలీజ్ ఈవెంట్ కు హాజరై చాలా బాగా మాట్లాడాడు. ఇప్పుడు ‘ట్యాక్సీవాలా’ సక్సెస్ అయిన నేపథ్యంలో బన్నీనే ముందుకొచ్చి పార్టీ ఇచ్చాడు. ఆదివారం రాత్రి ఈ పార్టీ జరిగింది. హీరో విజయ్ దేవరకొండ సహా టీం అంతా ఈ వేడుకకు హాజరైంది. అందరూ కలిసి కేక్ కట్ చేశారు. సరదాగా గడిపారు.

ఈ సినిమా రిలీజ్ కు ముందు చాలా ముభావంగా కనిపించిన దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ఈ వేడుకలో నవ్వులు చిందిస్తూ కనిపించడం విశేషం. ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి ‘ట్యాక్సీవాలా’ సక్సెస్ అయిన నేపథ్యంలో అతడిపై ఒత్తిడి అంతా ఎగిరిపోయినట్లే ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English