బాలీవుడ్‌కు ఊపిరిలూదే నిర్ణయం


కరోనా ధాటికి బాగా ప్రభావితమైన సినీ పరిశ్రమ అంటే.. బాలీవుడ్డే. కరోనా ఫస్ట్ వేవ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ ఇండస్ట్రీ అల్లాడిపోతూ ఉంది. ఫస్ట్ వేవ్ తర్వాత, సెకండ్ వేవ్ ఆరంభానికి ముందు వచ్చిన గ్యాప్‌ను బాలీవుడ్ ఎంతమాత్రం ఉపయోగించుకోలేకపోయింది. బాలీవుడ్‌కు కేంద్రమైన ముంబయిలో.. మహారాష్ట్రలో ఈ ఏడాదిన్నరలో ఎప్పుడూ థియేటర్లు పూర్తి స్థాయిలో నడవలేదు. సెకండ్ వేవ్ ఆరంభానికి ముందు మొదటగా థియేటర్లు మూతపడింది అక్కడే.

సెకండ్ వేవ్ ప్రభావం తగ్గాక కూడా అక్కడ వెండితెరల్లో వెలుగులు నిండలేదు. దేశవ్యాప్తంగా అన్ని చోట్లా థియేటర్లు పున:ప్రారంభం అయినా మహారాష్ట్రలో కరోనా సృష్టించిన విలయాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడి బిగ్ స్క్రీన్లకు తాళం వేసే ఉంచారు. ఐతే త్వరలోనే అక్కడ గ్రహణం వీడబోతోంది. దేశంలో ముందు ఊహించినట్లు థర్డ్ వేవ్ ప్రమాదం పెద్దగా లేకపోవడంతో మహారాష్ట్ర థియేటర్లను తెరుచుకోవడానికి ముహూర్తం ఖరారు చేసింది.

అక్టోబరు 22న మహారాష్ట్రలో థియేటర్లు పున:ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సినీ పరిశ్రమకు సమాచారం అందించారు. బాలీవుడ్లో భారీ చిత్రాలు రిలీజ్ చేయడానికి మంచి సీజన్‌గా భావించే దీపావళికి దాదాపు రెండు వారాల ముంగిట అక్కడ థియేటర్లను పున:ప్రారంభించనున్నారు. ఐతే ఆక్యుపెన్సీ ఎంత అన్నదానిపై స్పష్టత లేదు. అక్టోబరులో కూడా కరోనా ప్రభావం పెద్దగా లేకుంటే నేరుగా 100 శాతం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను తెరిచే అవకాశముంది. ఒకవేళ కేసులు పెరిగితే మాత్రం ఆక్యుపెన్సీ తగ్గడమే కాదు.. థియేటర్లను పున:ప్రారంభించే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవచ్చు.

మహారాష్ట్రలో థియేటర్లు అందుబాటులో లేకపోయినా ధైర్యం చేసి అక్షయ్ కుమార్ సినిమా ‘బెల్ బాటమ్’ను రిలీజ్ చేయగా.. వసూళ్ల మరీ తక్కువ వచ్చాయి. దీంతో తర్వాత రావాల్సిన భారీ చిత్రాలను పెండింగ్‌లో ఉంచారు. అంతా అనుకూలంగా ఉంటే దీపావళికి సూర్యవంశీ, 83 లాంటి భారీ చిత్రాలు బరిలో నిలిచే అవకాశముంది.