పవన్ వల్ల జరిగేపనేనా ఇది ?

వైసీపీ దాష్టీకపు పాలనకు వ్యతిరేకంగా జనసేన క్షేత్రస్ధాయిలో పోరాటాలు చేస్తుందని పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా ప్రకటించారు. ప్రతిపక్షమన్నాక యాక్టివ్ గా ఉండాల్సిందే. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, అధికార పార్టీ నేతల ధౌర్జన్యాలను ఎదుర్కోవాల్సిందే అనడంలో సందేహం లేదు. కానీ ఈ పని జనసేన అధినేత వల్ల అవుతుందా అనేదే పెద్ద సందేహం. ఎందుకంటే గతంలో కూడా పవన్ చాలాసార్లు పిలుపిచ్చినా అమల్లోకి వచ్చింది లేదన్న విషయం అందరికీ తెలిసిందే.

పవన్ పిలుపు ఎందుకు అమల్లోకి రావటంలేదంటే అసలు అధినేతే పట్టించుకోవటంలేదు కాబట్టి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని పిలుపిస్తున్న పవన్ తాను మాత్రం ఎంచక్కా సినిమాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలున్నాయట. ఇవన్నీ షూటింగులు జరుపుకుంటున్నాయి. ఈ మూడు పూర్తయ్యేసరికి కనీసం మరో ఏడాది పడుతుంది. మళ్ళీ ఈలోపు ఏ సినిమాలు ఒప్పుకోకపోతే పవన్ ఫ్రీ అయ్యేది ఏడాది తర్వాత మాత్రమే.

ఒకవేళ షూటింగ్ లు జరుపుకుంటున్న మూడు సినిమాలు పూర్తయ్యేలోగా కొత్త సినిమాలు ఒప్పుకుంటే ఇక ఎప్పటికి పవన్ ఫ్రీ అవుతారో తెలీదు. అంటే ఏరకంగా చూసుకున్నా పవన్ కొంతకాలం చాలా బిజీగా ఉంటారని అర్ధమైపోతోంది. మరిలాంటి నేపధ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్షేత్రస్ధాయిలో ధౌర్బాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీకపాలనపై పోరాటాలు చేస్తామంటే జనాలు ఎలా నమ్ముతారు ? అంటే పోరాటాలు చేయమని నేతలకు, కార్యకర్తలకు మాత్రమే పవన్ చెబుతున్నట్లు అర్ధమవుతోంది.

షూటింగ్ ల మధ్యలో తనకు ఏదన్నా గ్యాప్ వస్తే అపుడు మాత్రమే వచ్చి పోరాటాల పేరుతో పవన్ రోడ్డెక్కుతారేమో తెలీదు. ఈ పోరాటాలు  ఏ రూపంలో ఉండాలనో నిర్ణయించేందుకు ఈ నెల 27,28 తేదీల్లో విజయవాడలో సమావేశం అవబోతున్నట్లు కూడా చెప్పారు. సమావేశానికి పవన్ హాజరవ్వచ్చు. కానీ ఆ తర్వాత కార్యచరణ అమల్లో మాత్రం పవన్ ఉంటారా ? లేదా అనేది డౌటే. నాయకుడు లేకుండా మిగిలిన నేతలు, కార్యకర్తలు ఉద్యమాల్లో పాల్గొనాలంటే అధి సాధ్యమయ్యేది కాదు. పైగా పవన్ ప్రకటనలో మిత్రపక్షం బీజేపీ ఊసే లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది.

అసలు జనసేనకు జనాల్లో ఉన్న పట్టు అంతంతమాత్రమే. మొన్నటి పరిషత్ ఎన్నికల్లో జనసేన 177 ఎంపీటీసీల్లో గెలిచిందంటే అది స్ధానికంగా ఇతర పార్టీలతో చేసుకున్న సర్దుబాటు, సహకారం వల్లే సాధ్యమైందంటున్నారు. సరే విషయం ఏదన్నా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలంటే పవన్ నాయకత్వం వహిస్తేనే మిగిలిన నేతలు, కార్యకర్తలు ఫాలో అవుతారు. లేకపోతే ఎవరు పట్టించుకోరు. వ్యక్తిగతంగా పవన్ కు సిని అభిమానులున్నారే కానీ జనసేనకు పనిచేసే కార్యకర్తలు పెద్దగా లేరని అందరికీ తెలిసిందే. మరి పవన్ తాజా పిలుపు ఎంతమేరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.