వర్మ మరో సంచలనం.. ఈసారి తెలంగాణ రక్త చరిత్ర

సంచలనాలకుకేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటారు రాంగోపాల్ వర్మ. తానేం చేసినా సరే.. హాట్ టాపిక్ గా మారటం ఆయనకు అలవాటు. ఇటీవల కాలంలో వర్మలో రొమాంటిక్ నేచర్ బాగా ఎక్కువైందన్న మాట వినిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా తనకు బాగా అలవాటైన క్రైం స్టోరీ మీదకు వెళ్లారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో పాటు..రాయలసీమ ఫ్యాక్షన్.. మాఫియాల మీద ఇప్పటికే బోలెడన్ని సినిమాలు తీసిన ఆయన తాజా ప్రాజెక్టు ఇప్పుడు షాకింగ్ గా మారింది.

గతంలో అనంతపురం జిల్లాకు చెందిన దివంగత పరిటాల రవి…ఆయన ప్రత్యర్థుల జీవితాల్ని రక్తచరిత్రగా రెండు సినిమాలు తీసిన వర్మ.. తాజాగా తెలంగాణ రక్తచరిత్రను తెరకెక్కించాలని ఆయన భావిస్తున్న వైనం బయటకు వచ్చింది. ఈ సినిమాకు మూలకథను.. దివంగత మహానేత వైఎస్ కు వీర విధేయులైన కొండా మురళీ దంపతులతో తెర కెక్కించేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ‘కొండా’ పేరుతో రానున్న ఈ మూవీలో కొండా మురళీ-సరేఖ, ఆర్కే అలియాస్ రామకృష్ణ (మావో అగ్రనేత) పాత్రలు కీలకంగా ఈ మూవీని చేయనున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభించనున్నారు.

ఈ మూవీకి సంబంధించి.. తాను ఈ సినిమాను ఎందుకు చేయాలనుకున్న విషయాన్ని తన వాయిస్ క్లిప్ తో రిలీజ్ చేశారు. అందులో వర్మ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే వింటే.. ‘విజయవాడలో చదువుకోవడం వల్ల అక్కడి రౌడీయిజం గురించి తెలుసుకున్నా. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ వల్ల రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి తెలిసింది. కానీ తెలంగాణ సాయుధ పోరాటం గురించి నాకు ఏమీ తెలీదు. ఈ మధ్య అనుకోకుండా నేను కలిసిన మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసులతో మాట్లాడటం వల్ల మొదటిసారి ఆ విషయంపై ఓ అవగాహన వచ్చింది. నేను విన్న విషయాల్లో ముఖ్యంగా నన్ను ప్రభావితం చేసినా అంశం.. ఎన్‌కౌంటర్‌లో చంపేయబడ్డ ఆర్‌కె అలియాస్‌ రామకృష్ణకి, కొండా మురళీకి ఉన్న ప్రత్యేక సంబంధం’’ అంటూ ఆసక్తిని పెంచారు.

“ఆనాటి బ్యాగ్రౌండ్‌, అప్పటి పరిస్థితులను సినిమాటిక్‌గా క్యాప్చర్‌ చేయడానికి కావలసిన సమచారం ఇవ్వమని మురళీని కోరాను. ఈ సినిమా తీయడం వెనకున్న నా ఉద్దేశం విని ఆయన అంగీకరించారు. పెత్తందారుల పెత్తనం భరించలేక కొంతమంది బడుగు వర్గాలు తిరగబడి మొత్తం వ్యవస్థతోనే పోరాడుతున్న రోజులవి. అలా తిరగబడిన వారిపై ఉక్కుపాదాలతో తొక్కిపారేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా మురళీ, ఆర్‌కె నాయకత్వంలో తిరుగుబాటు జరుగుతూనే ఉండేది. విపరీత పరిస్థితుల నుంచే విపరీత వ్యక్తులు ఉద్భవిస్తారని కారల్‌మార్క్‌ 180 ఏళ్ల క్రితమే చెప్పాడు. అలాంటి విపరీత పరిస్థితుల మధ్య పుట్టినవారే కొండా మురళీ–సురేఖ. ఇప్పుడు నేను తీస్తుంది సినిమా కాదు. నమ్మశక్యం కానీ నిజజీవితాల ఆధారంగా తెలంగాణాలో జరిగిన ఒక రక్త చరిత్ర. 1995లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలనూ కరుస్తూనే ఉన్నాయి. ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు. దాని రూపు మార్చుకుంటుంది అంతే” అంటూ మరో సంచలనానికి తెర తీశారు వర్మ. ఇప్పటికే రక్తచరిత్ర మూవీలో తన మార్కును ప్రదర్శించిన వర్మ.. తెలంగాణ రక్తచరిత్రను ఏ రీతిలో చూపిస్తారో?