‘ట్యాక్సీవాలా’ నుంచి తీసేస్తారనుకుందట

‘ట్యాక్సీవాలా’ నుంచి తీసేస్తారనుకుందట

ఈ వారాంతంలో ప్రేక్షకుల ముందుకు రాబోయే ‘ట్యాక్సీవాలా’ మీద చాలా మంది చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రంతో చాలామంది కొత్త వాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. అందులో కథానాయిక ప్రియాంక జవాల్కర్ ఒకరు. ఇంతకుముందు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసిన ప్రియాంక.. ‘ట్యాక్సీవాలా’తో ఫీచర్ ఫిలిం హీరోయిన్‌గా మారింది.

తొలి సినిమానే గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ లాంటి పెద్ద బేనర్లు నిర్మిస్తున్న చిత్రంలో కథానాయికగా చేయడం తన అదృష్టమంటున్న ప్రియాంక.. ఈ సినిమాకు ముందు తనను హీరోయిన్‌గా ఎంచుకున్నప్పటికీ.. సినిమాలో కొనసాగిస్తారన్న నమ్మకం తనకు లేకపోయిందని చెప్పింది. అందుకే ‘ట్యాక్సీవాలా’లో తాను కథానాయికనని ఇంట్లో వాళ్లకు కూడా చాలా రోజుల పాటు చెప్పలేదని ఆమె వెల్లడించింది.

షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాక బిక్షు, ఆమె భార్య దగ్గర నటన నేర్చుకున్నానని.. నాలుగు నెలల శిక్షణ అనంతరం తన ఫొటోస్ గీతా ఆర్ట్స్ వాళ్లకు పంపిస్తే తర్వాత ఆడిషన్‌కు పిలిచారని.. ఆపై ‘ట్యాక్సీవాలా’కు ఎంపిక చేశారని ప్రియాంక చెప్పింది. ఐతే తనపై తనకు అప్పటికి అంత ఆత్మవిశ్వాసం లేదని.. అంత పెద్ద బేనర్లో సినిమా అనేసరికి ముందు ఓకే చేసినా తర్వాత తనను తీసేస్తారేమో అని భయం ఉండేదని.. అందుకే ఇంట్లో వాళ్లకు ఈ సినిమా ఓకే అయినట్లు చెప్పలేదని అంది. రెండు మూడు వారాల తర్వాత.. ఇక తనను తీసేయరు అని నమ్మకం కుదిరాకే ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు విషయం చెప్పానని ఆమె వెల్లడించింది. ఈ సినిమా చేస్తుండగా చెప్పుకోదగ్గ ఆఫర్లేమీ రాలేదని.. రిలీజ్ తర్వాత అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నానని ప్రియాంక చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English