మూడోసారి డివైడ్ టాక్.. మూడోసారి 150 కోట్లు

మూడోసారి డివైడ్ టాక్.. మూడోసారి 150 కోట్లు

టాక్‌తో సంబంధం లేకుండా సినిమాలు ఆడటం అందరు హీరోల విషయంలోనూ జరగదు. తెలుగులో అల్లు అర్జున్ సినిమాలు కొన్ని ఇలాగే ఆడాయి. కానీ ఈ ఏడాది ఆ మ్యాజిక్ జరగలేదు. ‘నా పేరు సూర్య’ నిలబడలేదు. ఐతే తమిళంలో మాత్రం ఒక స్టార్ హీరో డివైడ్ టాక్‌తోనే భారీ వసూళ్లు రాబడుతున్నాడు. అతనే విజయ్. గతంలో అతను నటించిన ‘తుపాకి’.. ‘కత్తి’ లాంటి సినిమాలకు పూర్తిగా పాజిటివ్ టాక్ వచ్చింది. అవి భారీ వసూళ్లు సాధించాయి. కానీ ‘కత్తి’ తర్వాత మాత్రం విజయ్ సినిమాలు వేటికీ పాజిటివ్ టాక్ రాలేదు. ‘తెరి’ లాంటి సాధారణమైన సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఎప్పుడో వచ్చిన ‘బాషా’ టైపు పాత చింతకాయ పచ్చడి కథతో తెరకెక్కిన ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. రూ.150 కోట్ల గ్రాస్ క్లబ్బులోకి అడుగుపెట్టి సంచలనం సృష్టించిందా చిత్రం.

ఇక గత ఏడాది విడుదలైన ‘మెర్శల్’కు సైతం పూర్తి పాజిటివ్ టాక్ ఏమీ రాలేదు. డివైడ్ టాక్‌తోనే మొదలైందీ సినిమా. కానీ ఇది కూడా సంచలన వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే రూ.150 కోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టింది. ఫుల్ రన్లో రూ.200 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇప్పుడు ‘సర్కార్’ కూడా అంతే. దీనికీ డివైడ్ టాక్ వచ్చింది. కానీ రిలీజ్ ముంగిట ఉన్న హైప్.. తర్వాత వివాదాల వల్ల వచ్చిన పబ్లిసిటీ తోడై ఈ చిత్రం భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే ‘సర్కార్’ రూ.150 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టడం విశేషం. తమిళంలో నాన్-రజనీ సినిమాల్లో అత్యంత వేగంగా రూ.150 కోట్ల క్లబ్బులోకి చేరిన సినిమా ఇదే కావడం విశేషం. శుక్రవారానికే రూ.150 కోట్లంటే.. వీకెండ్ అయ్యేసరికి.. ఫుల్ రన్లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. మరి డివైడ్ టాక్‌తో హిట్లు కొట్టే మ్యాజిక్‌ను విజయ్ ఇంకా ఎంత కాలం కొనసాగిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English