వైసీపీ ఎంపీలు రెంటికీ చెడ్డారా….?

ఔను! ఇప్పుడు ఈ మాటే వైసీపీలో వినిపిస్తోంది. ఒక ఎంపీ అంటే.. దాదాపు ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ప్ర‌జాప్ర‌తినిధి. ఆ ద‌ర్ప‌మే వేరు. ఎక్క‌డికి వెళ్లినా.. అధికారుల రాచ‌మ‌ర్యాద‌లు.. గౌర‌వాలు.. ప్రొటోకాల్‌.. ఇవ‌న్నీ.. ఎంపీల‌కు స‌హ‌జంగా ద‌క్కేవే. వీటికి అద‌నంగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి కూడా అంతే రేంజ్‌లో గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్కుతాయి. అయితే ఇది గ‌తం. ఇప్పుడు వైసీపీలో అలాంటి ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఎవ‌రూ ఎంపీల‌ను లెక్క‌చేయ‌డం లేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు అయితే.. త‌మ నియోజ‌క‌వ‌ర్గంలోకి రాకూడ‌దంటూ.. సొంత పార్టీ ఎంపీల‌కే ఆంక్ష‌లు పెడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది ఇలా ఏదొ ఒక‌టో రెండో.. నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపిస్తోంది అనుకుంటే పొర‌పాటే. దాదాపు 20 నియోజ‌క‌వ‌ర్గాల‌లో ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

మ‌రి ఎందుకిలా ప‌రిస్థితి మారిపోయంది. వైసీపీ అధికారం చేప‌ట్టి కేవ‌లం రెండున్న‌రేళ్లు మాత్ర‌మే అయింది. మ‌రో రెండున్న‌రేళ్ల‌కు కానీ, ఎన్నిక‌లు లేవు. ఈ క్ర‌మంలో అభివృద్ధి చేయాల్సిన అవ‌స‌రం ఎంతో ఉంది. ఇటు ఎమ్మెల్యేల‌పై ఎంత బాధ్య‌త ఉందో అంతే.. ఎంపీల‌పైనా ఉంది. ఇటు రాష్ట్ర నిదుల‌ను తీసుకురావాల్సిన బాధ్య‌త ఎమ్మెల్యేల‌పై ఉంటే.. అటు కేంద్రం నుంచి నిధులు తీసుకువ చ్చి నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ది చేసే బాధ్య‌త ఎంపీల‌పై ఉంటుంది. కానీ.. ఇప్పుడు ఈ అభివృద్ధి మంత్రం ప‌క్క‌కు పోయింది. ఎమ్మెల్యేలు వ‌ర్సెస్ ఎంపీల మ‌ధ్య వివాదాలు నిత్య‌కృత్యంగా మారాయి. ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. ఒక‌రికి ఒక‌రు వార్నింగులు ఇచ్చుకుంటున్నారు. ఎవ‌రికివారుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించుకుంటున్నారు. పార్టీ అధిష్టానం కూడా ఇన్ని విష‌యాలు తెలిసి మౌనంగా ఉంటోంది.

ఎంపీల విష‌యాన్ని తీసుకుంటే.. స‌హ‌జంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో అసెంబ్లీ అభ్య‌ర్థుల‌కు అంతో ఇంతో పెట్టుబ‌డులు పెడుతుంటారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఖ‌ర్చుల కోసం నిధులు ఇస్తారు. త‌మ పార్ల‌మెంటు ప‌రిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ తాము గెలవాలి కాబ‌ట్టి.. నిదుల‌ను స‌ర్దుబాటు చేసి.. ప్ర‌చారాన్ని హోరెత్తిస్తారు. దీంతో అసెంబ్లీ నియోఒజ‌క‌వ‌ర్గాల‌లోనూ త‌మ మాట అంతో ఇంతో నెగ్గాల‌ని కోరుకుంటారు. ఇక‌, ఎమ్మెల్యేల విష‌యానికి వ‌స్తే.. పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న నియోజ‌క‌వ‌ర్గం క‌నుక‌.. ఎంపీల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం.. త‌మ ప‌నులు చేయించుకోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధిలో ఎంపీల‌ను క‌లుపుకొని పోవ‌డం అనేది ఉంది.

ఇది ఆది నుంచి జ‌రుగుతున్న త‌తంగ‌మే. ఏదైనా ఒక‌టి అరా నియోజ‌క‌వ‌ర్గాల్లో తేడా వ‌చ్చినా.. స‌ర్దు బాటు చేసుకున్న ప‌రిస్థితి ఉంది. కానీ, వైసీపీ హ‌యాంలో దాదాపు 100 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు అస్స‌లు ప‌డ‌డం లేదు. రాజ‌మండ్రి, అనంత‌పురం, హిందూపురం, బాప‌ట్ల‌, న‌ర‌స‌రావుపేట‌, విశాఖ‌(ఇక్క‌డ ఎమ్మెల్యేల కంటే.. పార్టీ నేత‌ల‌తోనే ఎంపీకి సెగ‌లు పుడుతున్నాయి), విజ‌య‌న‌గ‌రం, క‌డ‌ప‌.. నెల్లూరు, ఒంగోలు(ఇక్క‌డ అస‌లు ఎంపీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు) , మ‌చిలీప‌ట్నం (ఈ ఎంపీ అస‌లు జిల్లాలోనే ఉండ‌డం లేదు), న‌ర‌సాపురం(ఈ ఎంపీ రెబ‌ల్ అయ్యారు) ఏలూరు ( ఈయ‌న అమెరికాలో ఎక్కువ ఉంటున్నారు) ఇలా.. 20 నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ నేత‌ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

కొంద‌రైతే.. నేరుగా దుయ్య‌బ‌ట్టుకుంటున్నారు. న‌ర‌సారావు పేట ఎంపీపై నేరుగా ఎమ్మెల్యేలు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. రాజ‌మండ్రిలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ ఎంపీ ర‌గ‌డ రోడ్డున ప‌డింది. దీంతో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందుల్లో ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి అధిష్టానం కూడా ఈ విష‌యాన్ని లైట్ తీసుకుంటోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారో చూడాలి.