సర్కార్ గొడవ.. రజనీ స్పందించాడు

సర్కార్ గొడవ.. రజనీ స్పందించాడు

తమిళనాట నాలుగు రోజులుగా హాట్ టాపిక్ ‘సర్కార్’ సినిమానే. ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట మామూలు హైప్ రాలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు దీటుగా ఇది భారీ స్థాయిలో రిలీజైంది. టాక్ కొంచెం అటు ఇటుగా వచ్చినా వసూళ్ల మోత మోగిపోతోంది. తమిళనాట కొత్త రికార్డులు నెలకొల్పుతూ ఈ చిత్రం దూసుకెళ్తోంది. రెండు మూడు రోజుల పాటు ఈ చిత్ర వసూళ్ల గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన వివాదం హాట్ టాపిక్ అవుతోంది.

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన విలన్ పాత్రకు కోమలవల్లి అనే పేరు పెట్టడం వివాదాస్పదమవుతోంది. అది మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు. ఉద్దేశపూర్వకంగానే విలన్ పాత్రకు జయ పేరు పెట్టారంటూ ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు. ఈ సినిమాలో అన్నాడీఎంకేతో పాటు ఇతర ప్రధాన పార్టీల మీద కూడా పెద్ద ఎత్తున సెటైర్లు పడ్డాయి. దీంతో మిగతా పార్టీలు కూడా సినిమా విషయంలో గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలోని కొన్ని సన్నివేశాల్ని తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై సినీ పరిశ్రమ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం దీనిపై స్పందించాడు. ఒకసారి సెన్సార్ అయిన సినిమా విషయంలో ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని రజనీ ప్రశ్నించాడు. ఇది ఖండనీయమని అన్నాడు. ఫిలిం మేకర్స్ స్వేచ్ఛను అడ్డుకోవడం తగదని.. ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గాలని హితవు పలికాడు. మరోవైపు నిర్మాతల మండలి అధ్యక్షుడు.. నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. సెన్సార్ అయి.. జనాలు కూడా చూసి ఆమోదించాక ఇప్పుడీ డ్రామాలేంటని అతను ప్రశ్నించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English