కోన.. ఇంకో కాంబినేషన్ సెట్ చేశాడు

కోన.. ఇంకో కాంబినేషన్ సెట్ చేశాడు

కోన వెంకట్ ఒకప్పుడు స్టార్ రైటర్. ఆయన కథ అందించినా.. మాటలు రాసినా ఆ సినిమా రేంజే వేరుగా ఉండేది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో కోన హవా నడిచింది. తెలుగులో మరే రైటర్ అందుకోని స్థాయిలో పారితోషకం అందుకున్నాడు కోన. కానీ తర్వాత అతడి జోరుకు తెరపడింది. కోన కథలు రొటీన్ అయిపోయాయి. డైలాగ్స్ ఔట్ డేటెడ్ అయిపోయాయి.

అలాగని కోన తెరమరుగు అయిపోలేదు. నెమ్మదిగా ప్రొడక్షన్లోకి అడుగుపెట్టాడు. వేరే వాళ్లతో పెట్టుబడి పెట్టిస్తూ.. క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తూ.. రచనలోనూ కొద్దిగా చేయి వేస్తూ.. సినిమాలో వాటా తీసుకుంటూ బండి నడిపిస్తున్నాడు. గత రెండు మూడేళ్లలో కోన ఫిలిం కార్పొరేషన్ నుంచి బాగానే సినిమాలొచ్చాయి. తాజాగా అతను మరో ఆసక్తికర కాంబినేషన్ సెట్ చేశాడు. ఈ రోజు సీనియర్ హీరోయిన్ అనుష్క పుట్టిన రోజు సందర్భంగా సినిమా అనౌన్స్ చేశాడు కోన.

ఇంతకుముందు మంచు విష్ణు హీరోగా ‘వస్తాడు నా రాజు’ అనే సినిమా తీసిన యువ దర్శకుడు హేమంత్ మధుకర్ దర్శకత్వంలో మాధవన్-అనుష్క హీరో హీరోయిన్లుగా సినిమా రాబోతోంది. దీనికి కోన సమర్పకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మాధవన్-అనుష్క 13 ఏళ్ల కిందట ‘రెండు’ అనే సినిమాలో నటించారు.

ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ ఈ జంటను చూడబోతున్నాం. తన తొలి సినిమా ‘వస్తాడు నా రాజు’ విడుదలైన ఎనిమిదేళ్లకు ఈ సినిమా మొదలుపెడుతున్నాడు హేమంత్. వచ్చే ఏడాది అమెరికాలో ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్లు కోన తెలిపాడు. ‘బాహుబలి’ తర్వాత ఆచితూచి అడుగులేస్తున్న అనుష్క.. ఇంతకాలానికి తన తర్వాతి సినిమా ఒప్పుకుంది. ‘భాగమతి’ సైతం ఎప్పుడో కమిటైన సినిమానే. మరోవైపు చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న మాధవన్ ఈ సినిమా ఓకే చేయడంతో దీనిపై మంచి అంచనాలే నెలకొన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English