చక్కనమ్మకి నత్తి కూడా అందమే!

చక్కనమ్మకి నత్తి కూడా అందమే!

చక్కనమ్మ చిక్కినా అందమే అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ నత్తిగా, నంగిగా, తెలుగు రాకుండా మాట్లాడడాన్నే ఫ్యాషన్‌గా భావిస్తోంది. డబ్బింగ్‌ ఆర్టిస్టులని పక్కన పెట్టి భాష రాని తారలతో తెలుగులో డబ్బింగ్‌ చెప్పించడం పెరిగిపోయింది.

తెలుగు వచ్చిన వారు మాత్రమే డబ్బింగ్‌ చెప్పడానికి కాస్త ఉత్సాహం చూపించేవారు. కానీ ఇప్పుడు మాట్లాడడం రాకపోయినా కానీ తమకి వచ్చిన భాషలో డైలాగులు రాసుకుని, తెలుగు వచ్చిన ఎవరిదైనా సాయం తీసుకుని డబ్బింగ్‌ చెప్పేస్తున్నారు. జనం కూడా దీనికి అలవాటు పడుతూ వుండడంతో మరింత మంది హీరోయిన్లు తమ స్వరం వినిపించే ధైర్యం చేస్తున్నారు. చాలా కాలం చిన్మయితో డబ్బింగ్‌ చెప్పించుకున్న సమంత ఇప్పుడు ఓన్‌ వాయిస్‌లో డైలాగులు చెబుతోంది.

మహానటి, యు టర్న్‌లో ఆమె సొంత గొంతుని వినిపించింది. కీర్తి సురేష్‌ కూడా అజ్ఞాతవాసి నుంచి స్వయంగా డబ్బింగ్‌ చెబుతోంది. మహానటితో పాటు పందెంకోడి 2, సర్కార్‌ లాంటి అనువాద చిత్రాలకి కూడా తన వాయిస్‌లోనే డబ్బింగ్‌ ఇచ్చింది. తెలుగు వచ్చీ రాని హీరోయిన్లతో డబ్బింగ్‌ చెప్పించడం త్రివిక్రమ్‌కి ఇష్టం. ఇటీవలే అరవింద సమేతలో కూడా పూజ హెగ్డేతో డబ్బింగ్‌ చెప్పించాడు.

ఈ ట్రెండులో ఇంతకాలం డబ్బింగ్‌కి దూరంగా వున్న ఇలియానా కూడా 'అమర్‌ అక్బర్‌ ఆంటొని'కి స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకుంది. తెలిసీ తెలియని భాషలో డైలాగులు చెప్పే విలన్లు చాలా మందే వున్నపుడు హీరోయిన్లతో చిలక పలుకులు పలికిస్తే తప్పేముందిలెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English