బ్లాక్‌బస్టర్ అన్నారు.. చివరికి ఫ్లాపే


యాక్షన్ హీరో గోపీచంద్‌కు హిట్ చాలా అవసరమైన స్థితిలో వచ్చిన సినిమా ‘సీటీమార్’. చివరగా 2014లో ‘లౌక్యం’తో హిట్టు కొట్టిన గోపీచంద్.. ఆ తర్వాత సక్సెస్ రుచి చూడనే లేదు. ఈ ఏడేళ్లలో అతను చేసిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దీంతో ‘సీటీమార్’పై అతను చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఈ సినిమా ట్రైలర్ అదీ చూస్తే ప్రామిసింగ్‌గానే కనిపించింది. మాస్ మెచ్చే సినిమాలా అనిపించింది.

ఈ సినిమాకు ఉన్నంతలో మంచి టాకే వచ్చింది. తొలి రోజు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. దీంతో చిత్ర బృందం హడావుడి మామూలుగా లేదు. ‘బ్లాక్‌బస్టర్ సీటీమార్’ అంటూ జోరుగా ప్రమోషన్లు మొదలుపెట్టేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సక్సెస్ మీట్ కూడా పెట్టి ఆ వేడుకను పెద్ద రేంజిలోనే చేశారు.

కానీ చిత్ర బృందం హడావుడికి.. తర్వాత బాక్సాఫీస్ పెర్ఫామెన్స్‌కు సంబంధం లేదు. వీకెండ్లోనే తడబడ్డ ‘సీటీమార్’.. ఆ తర్వాత అస్సలు నిలబడలేకపోయింది. తొలి రోజు రూ.4 కోట్ల దాకా షేర్ రాబట్టిన ఈ చిత్రం.. రెండు రోజుల వీకెండ్లో మూడున్నర కోట్లే వసూలు చేయగలిగింది. ఆ తర్వాత ఐదు రోజుల్లో వచ్చిన షేర్ కోటిన్నర మాత్రమే. ఎనిమిది రోజుల్లో ఈ చిత్రం రూ.9 కోట్ల షేర్ మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఈ వారం వచ్చిన ‘గల్లీ రౌడీ’ బ్యాడ్ టాక్‌తో రన్ అవుతుండటం కలిసొచ్చే అంశమే అయినా.. దాన్నేమీ ‘సీటీమార్’ ఉపయోగించుకుంటున్నట్లు లేదు.

బుకింగ్స్, వసూళ్లు అంతంతమాత్రంగానే కనిపిస్తున్నాయి. చివరికి సీటీమార్ షేర్ రూ.10 కోట్ల లోపే ఉండేలా కనిపిస్తోంది. అదే జరిగితే బ్రేక్ ఈవెన్‌కు రూ.2 కోట్ల దూరంలో ఆగిపోయి బాక్సాఫీస్ దగ్గర ఈ చిత్రం ‘ఫ్లాప్’ అనిపించుకోబోతున్నట్లే. తక్కువ రేట్లకు థియేట్రికల్ రేట్స్ అమ్మినప్పటికీ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మాస్ సినిమా ఇంత తక్కువ షేర్ కలెక్ట్ చేయడం నిరాశ కలిగించే విషయమే.