మాధవన్ హీరో ఆల్సో.. డైరెక్టర్ ఆల్సో

మాధవన్ హీరో ఆల్సో.. డైరెక్టర్ ఆల్సో

శుక్రవారం ‘సవ్యసాచి’ సినిమాలో విలన్‌గా పలకరించబోతున్న మాధవన్.. ఈ సినిమా పూర్తి చేసిన వెంటనే ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ అనే వైవిధ్యమైన సినిమాలో కథానాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్ బుధవారం రాత్రి 11.33 గంటలకు రిలీజ్ చేశారు. ముందు నుంచి మాధవన్ చెబుతున్నట్లే ఇదో ప్రత్యేకమైన సినిమాగా నిలిచేలాగే కనిపిస్తోంది ఈ టీజర్ చూస్తే.

అంగారకుడిపైకి రాకెంట్ పంపేందుకు అమెరికా, రష్యా ఎన్నో ఏళ్లు కష్టపడి.. ఎంతో ఖర్చు పెట్టి.. ఎన్నో ప్రయత్నాల తర్వాత.. విజయం సాధిస్తే.. ఇండియా 2014లో చాలా తక్కువ ఖర్చుతో ఒకే అటెంప్ట్‌తో రాకెట్ పంపి చరిత్ర సృష్టించడాన్ని చూపిస్తూ ఈ టీజర్ మొదలుపెట్టారు. నిజానికి ఒక శాస్త్రవేత్త మాట వింటే ఇండియా 20 ఏళ్ల కిందటే ఈ ప్రయత్నంలో విజయవంతం అయ్యేదట. ఆ సైంటిస్టే నంబి నారాయణన్.

ఈ శాస్త్రవేత్త గొప్పదనాన్ని గుర్తించకపోగా.. దేశద్రోహం ఆరోపణలతో అతడిపై కేసు పెట్టి  జైల్లో కూడా వేసింది ఈ దేశం. 56 రోజుల పాటు ఆయన జైల్లో ఉన్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తనను జైల్లో పెట్టడం వల్ల ఇండియా ఎలాంటి మూల్యం చెల్లించుకుందన్నదే ఈ కథ అంటూ మాధవన్ వాయిస్ ఓవర్‌ ఇచ్చాడు. ఈ చిత్రంలో నంబి పాత్రను మాధవనే చేస్తున్నాడు. ఈ చిత్ర తెలుగు వెర్షన్‌కు మాధవన్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.

ఇంతకంటే పెద్ద విశేషం ఏంటంటే.. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మాధవన్ దర్శకుడు కూడా. ముందు ఈ సినిమాకు అనంత్ మహదేవన్‌ను దర్శకుడిగా ప్రకటించారు. ఆయన నంబి జీవితంపై, ఆయనకు సంబంధించిన కేసుపై కొన్నేళ్లుగా పరిశోధన జరుపుతున్నాడు. ఐతే అనంత్‌కు దర్శకుడిగా అనుభవం లేకపోవడంతో డైరెక్షన్ బాధ్యతల్ని మాధవన్ కూడా పంచుకుంటున్నాడు. మాధవన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో విడుదలవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English