మొత్తానికి షర్మిలను గుర్తించిన కేటీయార్

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి కేటీయార్ మొదటిసారిగా గుర్తించారు. రాజన్న రాజ్యం తెస్తానంటు తెలంగాణాలో కొంతకాలం పర్యటనలు చేసిన షర్మిల ఈ మధ్యనే కొత్త పార్టీ పెట్టారు. అయితే ఆమె పార్టీ పెట్టినా అనుకున్నంత మైలేజీ సాధించలేకపోతున్నారు. అందుకనే పార్టీ ఉనికిని కాపాడుకునేందుకా అన్నట్లుగా నిరుద్యోగ సమస్యలపై అప్పుడప్పుడు నిరాహార దీక్షలు చేస్తున్నారు.

ఆమె ఎంత అవస్థలు పడుతున్నా వైఎస్సార్టీపీ కూడా ఒక రాజకీయ పార్టయేనని, షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా గుర్తించటానికి మిగిలిన పార్టీలు ఇష్టపడటం లేదు. అందుకనే సందర్భం ఏదైనా మిగిలిన పార్టీలు షర్మిలను, ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడటం లేదు. అలాంటిది ఒక్కసారిగా మంత్రి కేటీఆర్ షర్మిల గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వ్యవహారశైలిపై పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పించారు.

వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్ జాతీయ పార్టీలకు తొత్తులుగా మంత్రి మండిపడ్డారు. ఎంతసేపు కేసీఆర్ గురించే తప్ప బీజేపీ, కాంగ్రెస్ పార్టీల గురించి షర్మిల ఎందుకు మాట్లాడటం లేదంటూ నిలదీశారు.  తన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉందని కేటీయార్ మరచిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్నది టీఆర్ఎస్, కేసీఆర్ సీఎం కాబట్టే షర్మిల కేసీయార్ గురించే మాట్లాడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీలు ప్రతిపక్షాలు కాబట్టి వాటిగురించి ఏమి మాట్లాడినా ఉపయోగం లేదనే మాట్లాడటం లేదన్న విషయాన్ని కేటీయార్ కు తెలీదా ? బీజేపీ అయినా కేసీయార్ గురించే కాంగ్రెస్ అయినా సీఎంనే కదా టార్గెట్ చేసుకున్నది. కాబట్టి ప్రతిపక్షాలు ఏవి మాట్లాడినా కేసీయార్ నే టార్గెట్ చేసుకుని మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది ? పైగా కేసీయార్ ను నోటికొచ్చినట్లు తిడితే రాజద్రోహం కేసుల పెట్టడానికి కూడా ప్రభుత్వం వెనకాడేది లేదని కూడా కేటీయార్ హెచ్చరించటం ఆశ్చర్యంగా ఉంది.

చివరగా టీఆర్ఎస్ ఓట్లు చీల్చి జాతీయ పార్టీలకు లాభం చేయటానికే షర్మిల ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించటం గమనార్హం. సరే ఎలాంటి ఆరోపణలు చేసినా, విమర్శలు చేసినా మొత్తానికి షర్మిలను మంత్రి కేటీఆర్ గుర్తించటమే గమనించాలి. తమ అధినేత్రి షర్మిల గురించి కేటీయార్ అంతసేపు మాట్లాడటంపై బహుశా వైఎస్సార్టీపీ నేతలు చాలా హ్యాపీగా ఫీలవుతుంటారేమో. మొత్తానికి మొదటిసారి షర్మిలకు కూడా గుర్తింపు లభించినట్లయ్యింది.