వాస్తవం చెప్పేసిన ఎంఎల్ఏ

అభివృద్ధి పనులకు సంబంధించి అధికార పార్టీ ఒకరు క్షేత్ర స్ధాయిలోని వాస్తవ పరిస్థితులను జనాలకు వివరించారు. నేను-నా కార్యకర్త అనే కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన నియోజకవర్గంలో ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే నగరంలోని 18వ డివిజన్లోని హరినాధపురంలోని ఓ కార్యకర్త ఇంటికి ఎంఎల్ఏ వెళ్ళారు.  విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు వచ్చి ఎంఎల్ఏని కలిశారు.

కోటంరెడ్డి తో భేటీ అయిన సందర్భంగా ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న డ్రైనేజిని వెంటనే నిర్మించాలని కోరారు. అలాగే మినీ బైపాస్ రోడ్డుకు అనుసంధానంగా ఉన్న రోడ్డును నిర్మించాలని కోరారు. వీరుచెప్పిందంతా విన్న ఎంఎల్ఏ మాట్లాడుతు కార్పొరేషన్లో నిధులు లేని కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు ఇపుడు చేపట్టలేకపోతున్నట్లు అసలు విషయం చెప్పేశారు. ప్రభుత్వంలో నిధులన్నీ సంక్షేమ కార్యక్రమాలకే సరిపోతున్నాయని కాబట్టి అభివృద్ధికి నిధులు లేవన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు అందని విషయాన్ని తాము గతంలోనే సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు కూడా చెప్పారు. తమతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ తొందరలోనే అభివృద్ధి కార్యక్రమాలకు నిధులను విడుదల చేస్తానని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే తాను డ్రైనేజి, అనుసంధానం రోడ్డును వేయిస్తానని హామీ ఇచ్చారు.

జనాలు అడిగిన వెంటనే తాను అన్ని పనులు చేయించేస్తానని తప్పుడు హామీలు ఇవ్వలేనని కూడా కోటంరెడ్డి చెప్పడం గమనార్హం.  ఎంఎల్ఏ చెప్పింది ఒక విధంగా కరెక్టనటంలో తప్పులేదు. కానీ మరి అభివృద్ధి కార్యక్రమాలు జరిగేదెప్పుడు ? అన్నది అసలైన సమస్య. మొత్తం నిధులన్నింటినీ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చులు చేస్తుంటే అభివృద్ధి అన్నది ఎండమావేనా అని జనాలు అడుగుతున్నారు. ప్రభుత్వం అన్నాక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి.

అధికారంలోకి వచ్చిన మొదటి రెండున్నర ఏళ్ళు సంక్షేమంపై తర్వాత రెండున్నరేళ్ళు అభివృద్ధిపై జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నట్లు అధికార పార్టీ నేతలంటున్నారు. మరి నేతలు అనుకుంటున్నట్లు జగన్ నిజంగానే ఆ విధంగా ప్లాన్ చేస్తే ఓకేనే. కానీ అభివృద్ధిలో ప్లానింగ్ మిస్సయితే మాత్రం దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు పడటం ఖాయం. అభివృద్ధి ద్వారా మాత్రమే జనాల జీవన వ్యయాలు పెరుగుతాయి. లేకపోతే మన రాష్ట్రం కూడా మరో వెనుజువెలా దేశం లాగ తయారైపోవటం ఖాయం.