మళ్ళీ అదే తప్పు చేస్తోన్న త్రివిక్రమ్‌

మళ్ళీ అదే తప్పు చేస్తోన్న త్రివిక్రమ్‌

ఒక దర్శకుడిపై అపారమైన నమ్మకంతో వంద కోట్ల బిజినెస్‌ జరుగుతోందంటే సదరు దర్శకుడు ఎంతగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి? తన సినిమాని ఆ స్థాయిలో నిలబెట్టడానికి ఇంకెంతగా కృషి చేయాలి? ఇప్పటికీ త్రివిక్రమ్‌ బ్రాండ్‌ సేల్‌ అవుతోంది కానీ ఆయన మాత్రం అందుకు తగ్గ శ్రమ పెట్టడం లేదనే అనిపిస్తోంది. అజ్ఞాతవాసి ఫెయిల్యూర్‌ తర్వాత కథ కోసం ఎక్కువ సమయం కేటాయించకుండా తనకొచ్చిన ఐడియాని మాటలతో సినిమా చేసేసారు త్రివిక్రమ్‌. సంభాషణలు బాగున్నా సన్నివేశ బలం లేకపోవడంతో 'అరవింద సమేత' అంచనాలని అందుకోలేకపోయింది. పండగ వేళ విడుదల కావడం వల్ల స్వల్ప నష్టాలతో బయట పడగలిగింది కానీ లేదంటే పెను ప్రమాదమే సంభవించి వుండేది. అయితే ఈ చిత్రం కళాఖండం అనే రీతిన త్రివిక్రమ్‌ మాట్లాడుతున్నాడు.

ఎప్పుడూ ఏ సినిమాకీ చేసుకోని ప్రచారం ఈ చిత్రానికి ఆయన చేసుకుంటున్నారు. అజ్ఞాతవాసితో తన పని అయిపోయిందని అన్నవారికి సమాధానాలు ఇవ్వని త్రివిక్రమ్‌ ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారేమో అని కూడా అనిపిస్తోంది. అయితే ఇది ఒక సగటు సినిమాయేననే సంగతి ఆయన గుర్తించారా? తదుపరి చిత్రానికి అయినా తన పూర్తి బలంతో బయటకి వస్తారా? ఎంత చేయి తిరిగిన రచయిత అయినా, గడ్డం పండిన దర్శకుడైనా కానీ ఒక కథపై ఎక్కువ సమయం కేటాయిస్తే తప్ప గొప్ప అవుట్‌పుట్‌ ఇవ్వలేడు. బాహుబలి సినిమాలని తీసిన రాజమౌళి తదుపరి చిత్రం కోసం ఎందుకంత శ్రమ పడుతున్నట్టు? కానీ త్రివిక్రమ్‌ తన తదుపరి చిత్రం కోసం కూడా కథా పరంగా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు. ఎలాగైనా త్రివిక్రమ్‌తోనే చేయాలని అల్లు అర్జున్‌ పట్టుబట్టడంతో హీరో తరఫు నుంచి కూడా క్రాస్‌ క్వశ్చనింగ్‌ కానీ, స్క్రిప్ట్‌ కోసం గట్టి పట్టు కానీ వుండదు కనుక ఈ తక్కువ సమయంలో త్రివిక్రమ్‌కి ఎంత తడితే అదే తెర మీదకి వస్తుందనుకోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English