విక్రమార్కుడు సీక్వెల్.. రంగం సిద్ధం

రవితేజ.. రాజమౌళి.. అనుష్క.. వీళ్లందరి కెరీర్లలో ఒక సమమంలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం విక్రమార్కుడు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్నందుకుంది. తర్వాత తమిళం, హిందీ, కన్నడ, బెంగాలీ భాషల్లో రీమేక్ అయి ప్రతి చోటా ఘనవిజయం సాధించింది. తమిళంలో కార్తీ హీరోగా ‘శౌర్యం’ శివ ‘సిరుత్తై’ పేరుతో ఈ సినిమాను రీమేక్ చేయగా.. హిందీలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో ప్రభుదేవా ‘రౌడీ రాథోడ్’ పేరుతో ఈ సినిమా తీశాడు.

‘విక్రమార్కుడు’ కథకుడైన విజయేంద్ర ప్రసాద్.. హిందీలో ఈ సినిమాకు సీక్వెల్ తీసే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే. ఓ బాలీవుడ్ స్టూడియో ఆయనకు ఈ పని అప్పగించింది. గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ‘రౌడీ రాథోడ్’ సీక్వెల్ కోసం కథ రెడీ చేస్తున్నట్లు విజయేంద్ర వెల్లడించారు. ఇప్పుడు ఆ పని పూర్తయినట్లు సమాచారం.

హిందీతో పాటు తెలుగులోనూ ‘విక్రమార్కుడు’ సీక్వెల్ తీయబోతున్నారన్నది తాజా కబురు. హిందీలో అక్షయ్ కుమారే లీడ్ రోల్ చేయనుండగా.. తెలుగులో రవితేజనే సీక్వెల్లో నటించబోతున్నాడట. కొన్ని రోజుల ముందు వరకు తెలుగు వెర్షన్ విషయంలో ఏ చర్చా లేదు కానీ.. ఇప్పుడు ‘విక్రమార్కుడు-2’ తీయడానికి రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓ ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారట. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలిసింది.

ఐతే సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించబోవట్లేదు. ఇప్పుడు ఆయన రేంజ్ మారిపోయింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి భారీ చిత్రాలే తీస్తున్నారు. ఆల్రెడీ మహేష్ బాబుతో ఓ సినిమాకు ఆయన రెడీ అవుతున్నారు. వేరే ఎవరైనా మాస్ డైరెక్టర్‌ను పెట్టుకుని ఈ సినిమా తీసే అవకాశముంది. త్వరలోనే ఈ చిత్రం గురించి ప్రకటన రానున్నట్లు సమాచారం.