తమిళంలో కంటే తెలుగులోనే బిగ్ రిలీజ్

తమిళంలో కంటే తెలుగులోనే బిగ్ రిలీజ్

గత రెండు మూడు దశాబ్దాల్లో చాలామంది తమిళ హీరోలు తెలుగు మార్కెట్‌ను ఏలారు. కొందరైతే తెలుగు హీరోలకు దీటుగా మార్కెట్ సంపాదించుకున్నారు. ఐతే తమిళంలో తన కంటే చిన్న స్థాయి హీరోలెందరో తెలుగులో మంచి ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకోగా.. అక్కడ పెద్ద స్టార్ అయిన విజయ్ మాత్రం ఇక్కడ ఓ మోస్తరు మార్కెట్ తెచ్చుకోవడానికి చాలా ఏళ్లు ప్రయత్నం చేశాడు.

ఐతే ‘జిల్లా’.. ‘అదిరింది’ లాంటి సినిమాలు ఇక్కడ అతడికి కొంచెం మార్కెట్ తెచ్చాయి. ఈ ఊపులో అతడి కొత్త సినిమా ‘సర్కార్’ను నేరుగా తమిళంతో పాటే తెలుగులో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ ఈ సినిమా తీయడం.. కీర్తి సురేష్ కథానాయికగా నటించడంతో తెలుగులోనూ ఈ చిత్రానికి క్రేజ్ కనిపిస్తోంది.

విశేషం ఏంటంటే తమిళంలో కంటే తెలుగులో ఈ చిత్రం ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. తమిళనాట థియేటర్ల సంఖ్య తక్కువ. అక్కడ 500 థియేటర్లలో రిలీజ్ చేస్తే చాలా పెద్ద స్థాయి విడుదల అన్నట్లు. ‘సర్కార్’ను అక్కడ 600-700 మధ్య థియేటర్లలో విడుదల చేస్తున్నారు. తెలుగులో ఇదే చిత్రం 750 థియేటర్లలో రిలీజ్ చేయడానికి యాజమాన్యాలతో ఒప్పందాలు పూర్తయ్యాయి. ఇటీవలే ‘నవాబ్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేసిన వల్లభనేని అశోకే దీన్ని కూడా అందిస్తున్నాడు.

దీపావళికి తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు. ఒక్క రవిబాబు చిత్రం ‘అదుగో’ మాత్రమే రిలీజవుతోంది. మిగతా మూడు సినిమాలూ డబ్బింగ్‌వే. తమిళం నుంచే ‘రోషగాడు’ అనే సినిమా వస్తుండగా.. హిందీ నుంచి ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’ రిలీజవుతోంది. అన్నింట్లోకి కొంచెం ఎక్కువ క్రేజ్ ఉన్న సినిమా ‘సర్కార్’యే. అందుకే. దానికే అత్యధిక సంఖ్యలో థియేటర్లు దక్కేలా ఉన్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English