చిరు వద్దు.. విజయ్ ముద్దు

చిరు వద్దు.. విజయ్ ముద్దు

ఏఆర్ రెహమాన్ ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే మరే సంగీత దర్శకుడూ చేరని స్థాయికి చేరాడు. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులూ అందుకున్నాడు. ముందుగా తమిళ సినిమాలతో తనదైన ముద్ర వేసి.. ఆ తర్వాత హిందీ సినిమాలతో తిరుగులేని స్థాయిని అందుకున్నాడు. ఆపై హాలీవుడ్ రేంజికి ఎదిగాడు.

ఐతే తెలుగు సినిమాలతో మాత్రం రెహమాన్‌కు సరైన ఎప్పుడూ మంచి అనుభవాల్లేవు. అతను తెలుగులో నేరుగా సంగీతం అందించిన సినిమాలన్నీ నిరాశ పరిచాయి. సంగీత దర్శకుడిగా పెద్దగా పేరు లేనపుడు ‘సూపర్ పోలీస్’ అనే సినిమాకు మ్యూజిక్ చేశాడు. అది ఆడలేదు. ఆ తర్వాత ఎస్.జె.సూర్య తెలుగులో డైరెక్ట్ చేసిన ‘నాని’.. ‘కొమరం పులి’ సినిమాలకు సంగీతం అందించాడు. అవీ డిజాస్టర్లయ్యాయి. దీంతో మళ్లీ ఇటువైపు చూడలేదు. ఐతే గత ఏడాది ‘సైరా నరసింహారెడ్డి’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రానికి రెహమాన్‌ను సంగీత దర్శకుడిగా ఎంచుకుంది చిత్ర బృందం.

కానీ ఏం జరిగిందో ఏమో.. తర్వాత రెహమానే స్వయంగా ఈ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తనకు ఖాళీ లేకే ఈ సినిమా చేయట్లేదని రెహమాన్ చెప్పాడు. కానీ నిజానికి రెహమాన్ మరీ అంత బిజీగా ఏమీ లేడు. తమిళంలో చిన్న స్థాయి సినిమాలు కూడా చేస్తున్నాడతను. ఇక్కడ చిరు లాంటి మెగాస్టార్ సినిమాను వదులుకుని.. తమిళంలో మాత్రం తన మేనల్లుడు జి.వి.ప్రకాష్ కుమార్ నటిస్తున్న చిన్న చిత్రానికి అతను మ్యూజిక్ ఇస్తున్నాడు. మరోవైపు తమిళ స్టార్ విజయ్ అంటే రెహమాన్‌కు ప్రత్యేకమైన అభిమానం. అతడి సినిమా అంటే ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పేస్తున్నాడు.

అట్లీ లాంటి యంగ్ డైరెక్టర్ తీసిన ‘మెర్శల్’కు సంగీతం అందించిన రెహమాన్.. ఇప్పుడు విజయ్-మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘సర్కార్’కు కూడా పని చేశాడు. దీని తర్వాత విజయ్ నటించబోయే కొత్త సినిమాకూ అతనే సంగీత దర్శకుడట. అట్లీతో విజయ్ చేయబోయే సినిమాకు రెహమాన్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా ప్రకటించారు. తెలుగులో ‘సైరా’కు చేయడానికి ఖాళీ లేదని చెప్పి.. తమిళంలో రెహమాన్ లైన్లో పెడుతున్న సినిమాల వరుస చూస్తుంటే రకరకాల సందేహాలు కలుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English