మంచు మనోజ్ ఏం చేయబోతున్నాడు?

మంచు మనోజ్ ఏం చేయబోతున్నాడు?

మంచు మనోజ్ పోయినేడాది తాను సినిమాలు వదిలేసి సామాజిక సేవలోకి దిగబోతున్నట్లు సంకేతాలిచ్చి సంచలనం రేపాడు. ఐతే కుటుంబ సభ్యులు వారించడంతో కొంచెం వెనక్కి తగ్గాడు. ఐతే ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘ఒక్కడు మిగిలాడు’ దారుణమైన ఫలితాన్నందుకోవడంతో మనోజ్ నైరాశ్యంలో పడ్డాడు. ఏడాది నుంచి అసలు సినిమా ఊసే ఎత్తట్లేదు.

వ్యక్తిగత జీవితంలోనూ ఏవో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలొచ్చాయి. అవెంత వరకు నిజమో కానీ.. మనోజ్ మాత్రం తన చర్యలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా అతను స్వేచ్ఛగా ఎక్కడికి కావాలంటే అక్కడికి తిరిగేస్తూ.. సోషల్ మీడియాలో సినిమాలతో పాటు వివిధ అంశాలపై స్పందిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నాడు.

తాజాగా అతను ఒక సంచలన ప్రకటనతో జనాల ముందుకొచ్చాడు. తాను హైదరాబాద్ విడిచిపెట్టిన తన సొంత నగరం తిరుపతికి వెళ్లబోతున్నానని.. కొన్ని నెలల పాటు అక్కడే తన మకాం ఉంటుందని చెప్పాడు. ప్రపంచవ్యాప్తంగా తాను చాలా చోట్ల తిరిగానని.. రకరకాల మనుషుల్ని కలిశానని.. ఐతే తనకు అత్యంత మనశ్శాంతి తిరుపతిలోనే దొరుకుతుందని తెలిసిందని.. అందుకే అక్కడికి వెళ్తున్నానని.. తిరుపతి నుంచి ఓ కొత్త ప్రయాణం మొదలుపెట్టి.. దానిని తర్వాత తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని అనుకుంటున్నట్లు మనోజ్ తెలిపాడు. యువతకు సాయపడేలా ఏదైనా చేయాలనుకుంటున్నట్లు మనోజ్ వెల్లడించాడు.

ఐతే ఈ లేఖను బట్టి తన సినిమా కెరీర్, రాజకీయ జీవితంపై తీర్మానానికి రావొద్దని.. సినిమాల పట్ల తన ప్యాషన్ ఎప్పటికీ తరగదని.. ఎప్పట్లాగే డిఫెరెంట్ రోల్స్‌ చేస్తూనే ఉంటానని స్పష్టం చేశాడు. తాను ఏం చేయబోతున్నానో త్వరలోనే వెల్లడిస్తానని మనోజ్ తెలిపాడు. వచ్చే ఏడాది వేసవిలో ఏపీలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మనోజ్ ఏమైనా రాజకీయారంగేట్రం చేస్తాడా.. తిరుపతి పరిధిలోని ఏదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English