ఎన్నయినా అనండి.. ఆ షోకు తిరుగులేదు


‘బిగ్ బాస్’ షో మీద ఉన్న విమర్శలు, ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. ఈ షో ద్వారా ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని, పైగా జనాల మనసుల్ని కలుషితం చేస్తుందని చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఈ షోను రద్దు చేయాలంటూ సీపీఐ నారాయణ లాంటి వాళ్లు కోర్టుకు కూడా వెళ్లడానికి సిద్ధపడ్డారు. అసలేముందీ షోలో అంటూ తేలికగా తీసిపడేసేవాళ్లు.. ఈ షోను అసహ్యించుకునే వాళ్లు చాలామందే ఉన్నారు.

ఐతే ఎవరు ఏమన్నా సరే.. ఇదొక బ్లాక్‌బస్టర్ షో అనడానికి ఎప్పటికప్పుడు రుజువులు కనిపిస్తూనే ఉంటాయి. ఈసారి బిగ్ బాస్‌ మొదలవడానికి ముందు అంతగా సందడి కనిపించకపోవడంతో షో గురించి నెగెటివ్ కామెంట్లు చేసిన వాళ్లు కూడా ఇప్పుడు ఐదో సీజన్ లాంచింగ్ ఎపిసోడ్‌కు వచ్చిన జనాదరణ చూసి షాకవుతున్నారు. సెప్టెంబరు 5న, ఆదివారం ‘బిగ్ బాస్’ ఐదో సీజన్ ఆరంభం కావడం తెలిసిందే.

ఆ రోజు నాలుగున్నర గంటల పాటు లాంచింగ్ ఎపిసోడ్ సాగింది. ఎస్‌డీ, హెచ్‌డీ వెర్షన్లకు కలిపి ఆ రోజు ‘బిగ్ బాస్’ 18 టీఆర్పీ సాధించడం విశేషం. ఈ మధ్య బ్లాక్‌బస్టర్ సినిమాల ఫస్ట్ ప్రిమియర్స్‌కు కూడా ఇలాంటి రేటింగ్ రావట్లేదు. టీవీ షోల్లో వేటికీ కూడా ఆ స్థాయి రేటింగ్ రావట్లేదు. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ లాంచింగ్ ఎపిసోడ్‌కు సైతం ఇంత రేటింగ్ రాలేదు.

నిజానికి ఈ సారి బిగ్ బాస్ ఆరంభానికి ముందు సోషల్ మీడియాలో హైప్ అంతగా కనిపించలేదు. ఎప్పట్లా పార్టిసిపెంట్ల గురించి ఊహాగానాలు.. చర్చోప చర్చలు కనిపించలేదు. దీంతో ‘బిగ్ బాస్’ మీద జనాలకు ఆసక్తి తగ్గిందా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ గత ఆదివారం జరిగిన మారథాన్ లాంచింగ్ ఈవెంట్ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించిందని టీఆర్పీని బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ మా ఈ వారం 1303 జీఆర్పీలతో ఇండియాలోనే టాప్ ఎంటర్టైన్మెంట్ ఛానెళ్లలో ఒకటిగా నిలిచింది.